పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం తరువాత ముఖ్యమంత్రి మమత బెనర్జీ దూకుడు పెంచారు. రాబోయో ఎన్నికల్లో మోడీ సారథ్యంలోని బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం అవుతున్నాయి. ఇటీవలే శరద్‌పవార్ ఇంట్లో ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తరువాత బీజేపీకి చెక్ పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు మమత బెనర్జీ. ఈనెల 25 వ తేదీన ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. నాలుగురోజుల పాటు ఆమె ఢిల్లీలోనే ఉండి కీలక నేతలతో సమావేశం కాబోతున్నారు.
Read: ఆకట్టుకుంటున్న “మాస్ట్రో” ఫస్ట్ సింగిల్
2024 ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలంటే అన్ని ప్రతిపక్షపార్టీలను, బీజేపీని వ్యతిరేకించే నేతలను ఒక్కతాటిపైకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో పాటుగా ఎన్‌సీపీ, సమాజ్ వాదీ పార్టీ, ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో మమత చర్చలు జరుపుతారని సమాచారం. ఎలాగైనా బెంగాల్ కోటలో పాగా వేయాలని చూసిన బీజేపిని ఎదుర్కొని మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకున్న మమత బెనర్జీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే మమత రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. అన్ని పార్టీలతో సయోద్యగా ఉండేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మరి మమత వ్యూహం ఫలిస్తుందా? మమతతో అన్నిపార్టీలు చేతులు కలుపుతాయా? చూడాలి.