Bombay High Court: షార్ట్ స్కర్టులు ధరించడం, రెచ్చగొట్టేలా డ్యాన్స్ చేయడం లేదా హావభావాలను ప్రదర్శించడం వంటివి ప్రజలకు ఇబ్బంది కలిగించే అసభ్యకరమైన చర్యలుగా పరిగణించలేమని బాంబే హైకోర్ట్, నాగ్‌పూర్ బెంచ్ పేర్కొంది. మే నెలలో తిర్ఖురాలోని టైగర్ ప్యారడైస్ రిసార్ట్, వాటార్ పార్క్‌లోని బాంక్వెట్ హాల్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును హైకోర్టు కొట్టేసింది.
కొంతమంది ఆడియన్స్ కోసం ఆరుగురు మహిళలు డ్యాన్స్ చేస్తున్న సమయంలో పోలీస్ రైడ్ జరిగింది. బాంక్వెట్ హాలులోకి ప్రవేశించిన తర్వాత.. మహిళలు అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తున్నారని, వీరిలో కొంతమంది ఆడియన్స్ మహిళలపై రూ.10 నోట్లను విసురుతున్నారని ఎఫ్ఐఆర్ నమోదైంది. కొందరు ఆ సమయంలో ఆల్కాహాల్ సేవిస్తున్నట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఐపీసీలోని సెక్షన్లు 294 అశ్లీల చర్యలకు సంబంధించి, మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Read Also: Uttar Pradesh: దెయ్యం వదిలిస్తానని చెప్పి యువతిపై అత్యాచారం..
ఈ కేసును విచారించిన హైకోర్టు.. సెక్షన్ 294 ప్రకారం ఒక చర్య నేరం కావాలంటే.. అది బహిరంగంగా జరగాల్సి ఉంటుందని చెప్పింది. ఈ సెక్షన్ ప్రకారం.. అశ్లీల చర్య, అశ్లీల పాటలు లేదా పదాలు చూసిన తర్వాత, విన్న తర్వాత చికాకు కలిగించేలా ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఎవరైనా సమీపంలోని వ్యక్తులు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని కోర్టు ఆర్డర్ పేర్కొంది. ఐపీసీ ‘పబ్లిక్ ప్లేస్’ని నిర్వచించలేదని నొక్కి చెప్పింది.
షార్ట్ స్కర్టులు ధరించడం, రెచ్చగొట్టే విధంగా డ్యాన్స్ చేయడం, అశ్లీలంగా సైగలు చేయడం వంటి వాటిని పోలీస్ అధికారులు భావించే అసభ్యకర చర్యలుగా భావించలేమని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కాలంలో మహిళలు ఇలాంటి దుస్తులు ధరించడం సాధారణమైందని, ఆమోదయోగ్యంగా ఉందని, మనం సినిమాల్లో తరుచుగా ఈ తరహా దుస్తుల్ని చూస్తుంటాం అని చెప్పింది.