Uttar Pradesh: సైన్స్ ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇప్పటికీ కొందరు అనారోగ్యం బాగా లేదని బాబాలు, మంత్రగాళ్ల వద్దకు వెళ్తున్నారు. దయ్యం పట్టిందనే అపోహతో ప్రాణం, మానం మీదికి తెచ్చుకుంటున్నారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇలా కొందరు బాధితుల నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా, అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో చాలానే జరిగాయి.
ఇదిలా ఉంటే తాజాగా 52 ఏళ్ల మంత్రగాడు 18 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని భదోహిలో జరిగింది. దుష్టశక్తులను తరిమేస్తానని చెబుతూ.. యువతిపై ఘోరానికి పాల్పడ్డాడు. నిందితుడిని శనివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై ఎస్పీ మీనాక్షి కాత్యాయన్ చెప్పిన వివరాల ప్రకారం.. మీర్జాపూర్ నుంచి ఒక కుటుంబం సీతామర్హిని సందర్శించేందుకు వచ్చిందని, వారికి అక్కడ మోతీలాల్ (52)అనే వ్యక్తి తనను తాను క్షుద్ర మాంత్రికుడిగా పరిచయం చేసుకున్నాడని, బాధిత మహిళ తల్లిదండ్రులు తమ కూతురుకు దెయ్యం పట్టిందని, నయం చేయాలని కోరారని పోలీసులు వెల్లడించారు.
Read Also: Israel: ‘పాలస్తీనా ఒసామా బిన్ లాడెన్’ని చంపేస్తామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ..
భూతవైద్యం ద్వారా యువతి శరీరం నుంచి దెయ్యాన్ని తరిమికొట్టగలనని సదరు కుటుంబాన్ని మోతీలాల్ నమ్మించాడు. దీని కోసం రూ. 4000 వసూలు చేసినట్లు ఎస్పీ చెప్పారు. గురువారం సాయంత్రం మహిళ తండ్రి ఆమెను మోతీలాల్ వద్దకు తీసుకెళ్లిన తర్వాత నిందితుడు యువతిని బైక్ పై దర్వాసీ గ్రామంలోని ఆలయం వెనక ఉన్న గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు.
మూడు గంటల తర్వాత మోతీలాల్ మహిళను బయటకు తీసుకెళ్లి, మరుసటి రోజు తనను కలవాలని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే బాధితురాలు తనకు జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులతో చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యువతి తండ్రి నిందితుడు మోతీలాల్ పై ఫిర్యాదు చేశారు. అతనిపై అత్యాచారం, మోసం, బెదిరింపు కేసులు నమోదు చేశారు. యువతని వైద్య పరీక్షల కోసం పంపగా, అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయింది.