Calcutta HC: జైలులో ఉన్న మహిళా ఖైదీలు జైలులోనే గర్భం దాలుస్తున్నారని కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. కస్టడీలో ఉన్న సమయంలోనే మహిళా ఖైదీలు గర్భం దాల్చినట్లు కోర్టుకు సమాచారం అందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమస్య తీవ్రమైనదిగా పరిగణిస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది.
Read Also: OTT: సైలెంట్ గా ఓటీటీలో బేబి హీరో కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇప్పటి వరకు జైళ్లలో కనీసం 196 మంది శిశువులు జన్మించారని పిల్ దాఖలు చేసిన వ్యక్తి హైకోర్టుకు తెలియజేశారు. జైలు లోపల భద్రతను పర్యవేక్షించాలని కోర్టును కోరారు. మహిళా ఖైదీలు ఉండే ఎన్‌క్లోజర్లలో, కరెక్షన్ హోమ్స్‌లో పురుష ఉద్యోగులను పూర్తిగా నిషేధించాలని కోరారు. చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం మరియు జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని ‘తీవ్రమైన సమస్య’గా పేర్కొంది. ఈ విషయాన్నింటినీ క్రిమినల్ కేసులు విచారించే బెంచ్‌కి బదిలీ చేయడం సరైందని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
జైలులో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని వివిధ జైళ్లలో 196 మంది చిన్నారులు ఉన్నారని అమికస్ క్యూరీ హైకోర్టుకు తెలిపారు. ఇటీవల, తాను కరెక్షన్ హోమ్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్(స్పెషల్), లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శితో మహిళా కరెక్షన్ హోమ్స్‌ని సందర్శించిన సమయంలో ఒక గర్భవతితో పాటు, 15 మంది ఇతర మహిళా ఖైదీలు వారి పిల్లలతో ఉన్నట్లు కనుగొన్నానని, వారంతా జైలులో జన్మించారని కోర్టుకు వెల్లడించారు. దీనిపై సోమవారం మరోసారి విచారణ జరిగే అవకాశం ఉంది.