Online Love: ఉత్తర్ ప్రదేశ్ అలీఘఢ్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు అనే వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లిన వార్త వైరల్ అయింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా పాకిస్తాన్ సరిహద్దును దాటి దాయాది దేశంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అక్కడి పోలీసులు బాబుని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌కి చెందిన సనా రాణి(21)కి బాదల్ బాబులో ఆన్‌లైన్ స్నేహం కుదిరింది. తన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని కలవడానికి సరిహద్దు దాటి, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని బహౌద్దీన్ జిల్లాలో అరెస్టయ్యాడు. సనాని పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే బాబు సరిహద్దు దాటాడు.
ఇదిలా ఉంటే, బాబుని పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని ప్రియురాలు సనా రాణి పెద్ద షాక్ ఇచ్చింది. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. ‘‘బాబు, తాను రెండున్నరేళ్లుగా ఫేస్‌బుక్ స్నేహితులమని, అయితే అతడిని పెళ్లి చేసుకునే ఆసక్తి తనకు లేదని ఆమె పోలీసులకు చెప్పింది’’ అని పంజాబ్ సీనియర్ పోలీస్ అధికారి నసీర్ షా గురువారం చెప్పారు.
Read Also: Rohit Sharma : ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ ఔట్?
బాబు అక్రమంగా సరిహద్దు దాటి బహౌద్దీన్‌లోని సనా రాణి ఉంటున్న మాంగ్ గ్రామానికి చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. బాబు రాణిని కలిశారా..? అనే ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వలేదు. రాణి పోలీసులు ఒత్తిడికి తలొగ్గి, స్టేట్‌మెంట్ ఇచ్చిందా.. అనేది ధ్రువీకరించబడలేదు. బాబుతో రాణికి ఉన్న సంబంధాల గురించి ఆమెతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బాబుపై పాకిస్థాన్ ఫారిన్ యాక్ట్ సెక్షన్ 13, 14 కింద కేసులు నమోదు చేశారు.
ఇటీవల కాలంలో సరిహద్దు దాటిన అనేక ప్రేమ వ్యవహరాలు వార్తల్లో అంశాలుగా నిలిచాయి. సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు ఇష్టపడి సరిహద్దులు దాటుతున్నారు. గతంలో అంజు అనే భారతీయ మహిళ, తన ప్రేమికుడిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లింది. ఆమె ఇస్లాంలోకి మారి నస్రుల్లా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పబ్‌జీ గేమ్ ద్వారా పరిచయమైన పాకిస్తానీ మహిళ సీమా హైదర్, తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా ఇండియా వచ్చింది. గతేడాది 19 ఏళ్ల పాకిస్తానీ యువతి ఇక్రా జివానీ 25 ఏళ్ల ములాయం సింగ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇక్రా, ములాయం సింగ్ నేపాల్‌లో వివాహం చేసుకున్నారు.