Udhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తాను మతసామరస్యాన్ని గౌరవిస్తానని ప్రకటించారు. తాను ‘‘క్రైస్తవుడిగా గర్విస్తున్నాను’’ అని ప్రకటించుకుుంటూనే, అన్ని విశ్వాసాలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి మాట్లాడుతూ.. విభజన, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కొందరు మతాన్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
‘‘ గత సంవత్సరం ఒక క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో నేను క్రైస్తవుడిని అని గర్వంగా చెప్పాను. ఇది చాలా మంది సంఘీలను చికాకు పెట్టింది. కానీ ఈ రోజు మళ్లీ చెబుతున్నాను, నేను క్రిస్టియన్ అని గర్విస్తున్నాను’’ అని ఉదయనిధి అన్నారు. ‘‘నేను క్రైస్తవుడిని అని మీరు అనుకుంటే, నేను క్రైస్తవుడిని. నేను ముస్లిం అని మీరు అనుకుంటే, నేను ముస్లింనే. నేను హిందువునని మీరు అనుకుంటే, నేను హిందువునే. నేను అందరికీ కామన్. అన్ని మతాలు మనకు ప్రేమను చూపించమని మాత్రమే బోధిస్తాయి’’ అని ఆయన అన్నారు.
Read Also: Komatireddy vs Harish Rao: డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాడీవేడి సంభాషణ!
ఇటీవల అలహాబాద్ న్యాయమూర్తి వ్యాఖ్యల్ని ఉదయనిధి ప్రస్తావించారు. ‘‘ఇటీవల ఒక న్యాయమూర్తి మతం పట్ల విద్వేషంతో మాట్లాడటం మనం చూశాం. అలహాబాద్ జడ్జి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తికి న్యాయమూర్తి పదవి ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. అతడి నుంచి న్యాయాన్ని ఎలా ఆశించగలం’’ అని అన్నారు. ఆయనను తొలగించడానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు మద్దతుగా సంతకాలు చేయగా, ఎఐడీఎంకే మద్దతు ఇవ్వలేదని, ఆ పార్టీ బీజేపీ బానిసలా పనిచేస్తుందని దుయ్యబట్టారు.
బీజేపీ-ఏఐడీఎంకే కూటమి రహస్య బంధం కొనసాగుతోందని అన్నారు. ఏఐడీఎంకే రాజ్యాంగ విలువల కన్నా రాజకీయ విధేయతకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. గతేడాది ఉదయనిధి ‘‘సనాతన ధర్మాన్ని’’ డెంగ్యూ, మలేరియాలో పోల్చుతూ, నిర్మూలించాలని వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.