BJP: బంగ్లాదేశ్ అల్లర్లు, హింసను ఉద్దేశించి కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. భారత్‌లో కూడా ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో, భారత్‌లో కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. కాంగ్రెస్ నేతలు దేశంలో బంగ్లాదేశ్ పరిస్థితి రావాలని కోరుకుంటున్నారా..? అని బీజేపీ ప్రశ్నించింది. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి కూడా హసినాకు పట్టిన గతే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏదో రోజు ప్రజలు ప్రధాని ఇంటిని స్వాధీనం చేసుకుంటారని ఆయన చెప్పడంపై కేసు నమోదైంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఫైర్ అయ్యారు. ఇది బంగ్లాదేశ్ కాదని, ఇది నరేంద్రమోడీ భారతదేశమని అన్నారు. శనివారం జోధ్‌పూర్ విమానాశ్రయంలో ఆయన మీడియాలో మాట్లాడుతూ.. కొందరు భారత్‌లో బంగ్లాదేశ్ పరిస్థితి వస్తుందని వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. దీనిపై మాట్లాడే వారికి ఇది మోడీ భారతదేశం అని బహుశా తెలియదేమో అని అన్నారు, దీనికి పాల్పడితే వారికి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని హెచ్చరించారు. షేకావత్ నేరుగా ఏ కాంగ్రెస్ నేత పేరు తీసుకోనప్పటికీ, ఇటీవల కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, మణిశంకర్ అయ్యర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.