The Kerala Story: ‘‘ ది కేరళ స్టోరీ’’ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీన్ని ఆపాలంటూ పలువురు సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు పలు ముస్లిం సంఘాలు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతలా వ్యతిరేకతకు కారణం ఏమిటని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.
కేరళ రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడిలు, రాడికలైజేషన్, టెర్రరిజం ఇతివృత్తంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమా రూపొందించారు. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించి, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రల్లో నటించారు. మే 5 సినిమా విడుదల కానుంది.
కేరళలో సుమారు 32,000 మంది హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన మహిళలు ఇస్లాం మతంలోకి మార్చబడ్డారని, ఐసిస్ టెర్రిరిజం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కొంత మంది ఇందులో చేరడానికి సిరియాకు వెళ్లినట్లు సినిమాలో చూపించారు. ఈ సినిమాపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సినిమా నిలిపేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Read Also: The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమా ఆపడానికి సుప్రీం నిరాకరణ..
కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఈ సినిమాను వ్యతిరేకిస్తోంది. సీఎం పినరయి విజయన్ ఇది ఆర్ఎస్ఎస్ అబద్దపు ప్రచారంగా అభివర్ణించారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి శశిథరూర్ సినిమా నిర్మాతలు కేరళ రాష్ట్ర వాస్తవికతను వక్రీకరించారని ఆరోపించారు. కేరళలో 32,000 మహిళలు ఇస్లాంలోకి బలవంతంగా మారారని నిరూపిస్తే రూ. 1 కోటి ఇస్తానని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే కేరళ స్టోరీ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన సినిమా అని దర్శకుడు సుదిప్తో సేన్, నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా చెప్పారు. విడుదలకు ముందే ఇన్ని వివాదాలను ఎదుర్కొంటున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందో చూడాలి.