Terror group ‘The Resistance Front’ threatens RSS: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ క్రియాశీలకంగా ఉన్న లష్కరేతోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ‘ ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకులను బెదిరించింది. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఆర్ఎస్ఎస్ నేతలు, కార్యకర్తలకు సంబంధించి ఓ హిట్ లిస్టును కూడా విడుదల చేసింది. మొత్తం 30 మంది ఆర్ఎస్ఎస్ నాయకుల పేర్లను హిట్ లిస్టులో పేర్కొంది. వారంతా రక్తం చిందించాల్సి వస్తుందంటూ చంపేస్తామని బెదిరించింది.
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్ పాల్పడుతూ.. హైబ్రీడ్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది. కాశ్మీర్ విముక్తి కోసం అంటూ లష్కర్ తరపున పనిచేస్తోంది. గతంలో చాలా సార్లు నాన్ లోకల్స్, వలస కూలీలు, హిందువులు, భారతదేశానికి మద్దతు తెలిపే ముస్లింలపై దాడులకు తెగబడింది.
ఇటీవల దేశ విభజనపై, పాకిస్తాన్ పరిస్థితిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవిభజనతో పాకిస్తాన్ ఇప్పుడు బాధపడుతోందని అని అన్నారు. తామెందుకు భారత్ తో విడిపోయామా..? అని పాక్ ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. కొత్త భారతదేశాన్ని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. అఖండ భారత్ నిజమే కానీ, విభజించబడిన భారత్ ఓ పీడకల అని ఆయన వ్యాఖ్యానించారు.