Tamil Nadu: సామాన్యంగా గజం భూమిని కూడా ఫ్రీగా ఇచ్చే రోజులు కావు. భూమి అంటే గౌరవం.. తులం బంగారం పోయినా పర్వాలేదు కానీ, ఇంచు భూమి కోసం హత్యలు జరిగే కాలం ఇది. అయితే తమిళనాడులో ఓ మహిళ మాత్రం చేసిన పనిని చూస్తే నువ్వు త్యాగమూర్తివమ్మ అని అనకుండా ఉండలేదు. ఏకంగా కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వ పాఠశాల కోసం విరాళంగా ఇచ్చేసింది.
మదురైలోని కోడిక్కుళానికి చెందిన ఓ మహిళ ప్రభుత్వ పాఠశాల విస్తరణ కోసం రూ. 7 కోట్ల విలువైన ఎకరం భూమిని విరాళంగా ఇచ్చింది. దీనికి గానూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమెకు అవార్డు ఇవ్వనున్నట్లు సీఎం స్టాలిన్ ఆదివారం తెలిపారు. విద్య అనేది అక్షర సంపద అని పేర్కొంటూ.. ‘‘ఆయి పురాణం అమ్మాళ్ విరాళం వేలాది విద్యార్థులకు ప్రయోజనం. ఆమె తమిళ సమాజానికి చిహ్నంగా ఉన్నారు. విద్యా, బోధన అత్యున్నత ధర్మం. రాబోయే గణతంత్ర దినోత్సం రోజున ప్రభుత్వం తరుపున ప్రత్యేక అవార్డుతో సత్కరిస్తాం’’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు.
Read Also: Ram Mandir: అమెరికాలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు.. కార్ల ర్యాలీ నిర్వహించిన భారతీయులు
జాతీయ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్న ఆయిపురాణం అమ్మాళ్ కోడిక్కుళంలోని ఒట్టకడై సమీపంలోని ప్రభుత్వ పాఠశాలని హయ్యర్ సెకండరీ స్కూల్‌గా మార్చడానికి తన స్థలం అవసరమని గుర్తించి, ఆమె తన భూమిని రిజస్ట్రార్ వద్ద ప్రభుత్వం పేరు మీద నమోదు చేశారు. అనంతం భూమికి సంబంధించిన పత్రాలను విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. ఈ సమాచారం తెలిసిన మధురై ఎంపీ సు వెంకటేశన్ జనవరి 11న కోడిక్కుళం వెళ్లి ఆమెను కలిశారు. ‘తీసుకోవాలని అనుకనే వారు చాలా మంది ఉంటారు..కానీ ఇవ్వాలనుకునే వారు కొంతమంది మాత్రమే ఉంటారు’ ఎంపీ ఆమెపై ప్రశంసలు కురిపించారు.