Tamil Nadu: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ సారి అధికార డీఎంకే, అన్నాడీఎంకే, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) మధ్య ముక్కోణపు పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందనే వాదనలు తమిళనాట జోరుగా వినిపిస్తున్నాయి.
Read Also: Vivek Ramaswamy: ‘‘ గో బ్యాక్ టూ ఇండియా’’.. వివేక్ రామస్వామి జంటపై జాత్యహంకార వ్యాఖ్యలు..
అయితే, జరుగుతున్న ప్రచారంపై విజయ్ కానీ, ఆ పార్టీ నేతలు కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. దీనికి తోడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేయడానికి టీవీకే పార్టీ పని ప్రారంభించింది.
ప్రతీ నియోజకవర్గం నుంచి ముగ్గురిని ఎంపిక చేసి, విజయ్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ చివరలో అభ్యర్థిని ఖరారు చేయడానికి ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో ముగ్గరు చొప్పున అభ్యర్థుల్ని టీవీకే ఎంపిక చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతల వివరాలను టీవీకే కార్యదర్శి ఆనంద్ స్వయంగా ఫోన్ చేసి సేకరిస్తున్నారు. మరోవైపు, 10వ,12వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో టీవీకే అధినేత విజయ్ భేటీ కానున్నారు. చెన్నై సమీపంలోని మామల్లపురంలోని ఓ ప్రైవేట్ హోటల్లో విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయనున్నారు. గత మూడేళ్లలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నారు.