Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. సీఎం స్టాలిన్ క్యాబినెట్ మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. అధికార డీఎంకే పార్టీ ఈడీ రైడ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా డీఎంకేకు మద్దతు పలుకుతున్నాయి.
Read Also: YouTube: కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నా చాలు..
ఇదిలా ఉంటే మంత్రి వి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి తమిళనాడులోకి నో పర్మిషన్ అని చెప్పారు. సీబీఐకి ఇచ్చే సాధారణ సమ్మతిని తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మనీలాండరింగ్ కేసులో డిఎంకె మంత్రి వి సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత డిఎంకె ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలాజీ ఇళ్లు, కార్యాలయంలో ఈడీ సోదాలు చేయడంపై అక్కడి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి అని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఐకి అనుమతి నిరాకరించిన బీజేపేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా చేరింది. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ , పశ్చిమ బెంగాల్ సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుని సీబీఐకి నో పర్మిషన్ చెప్పాయి. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1946, సీబీఐ విచారణ చేయాలంటే రాష్ట్రాల ముందుస్తు అనుమతి తప్పనిసరి చేసినప్పటికీ.. 1989 మరియు 1992లో కొన్ని కేటగిరీల కేసులకు కొన్ని మినహాయింపులు ఇవ్వబడ్డాయి. అయితే ఈడీ, ఎన్ఐఏ దర్యాప్తులపై ఇది ప్రభావం చూపదు.