ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. కొన్ని సవరణలను ప్రతిపాదించింది.. కానీ, అప్పుడే రాష్ట్రాలు.. కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నాయి.. తాజాగా, ఈ జాబితాలో మరో రెండు రాష్ట్రాలు చేరాయి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరాయి విజయన్.. కేంద్రం ప్రతిపాదనలపై తమ లేఖలో ఇద్దరు సీఎంలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే కేంద్రం ప్రతిపాదనలను పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలను వ్యతిరేకిస్తున్నారు.. వారు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు.. ఇక, ఇవాళ పీఎంకు తమిళనాడు సీఎంతో పాటు కేరళ ముఖ్యమంత్రి కూడా లేఖలు రాశారు..
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఎంకే స్టాలిన్.. తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని.. ఐఏఎస్ క్యాడర్ రూల్స్, 1954ను సవరించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తన లేఖలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.. ఈ ప్రతిపాదనలు భారత దేశ సమాఖ్య పునాదులను బలంగా కుదిపేస్తాయని ఆవేదన వ్యక్తం చేసిన స్టాలిన్.. అందువల్ల వీటిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ఐఏఎస్ కేడర్ నిబంధనలకు కేంద్రం ప్రతిపాదించిన సవరణను ఉపసంహరించుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.. ఈ ప్రతిపాదనలను సహకార సమాఖ్య వ్యవస్థ యొక్క మూలాన్ని బలహీనపరుస్తాయన్నారు.
అయితే రాష్ట్రాల ఆందోళనకు కొన్ని కారణాలు ఉన్నాయి.. కేంద్రం కొత్త నిబంధనలను తీసుకొస్తే రాష్ట్రాల పరిపాలన చిక్కుల్లో పడుతుందనే విమర్శలు ఉన్నాయి.. ముఖ్యంగా నాలుగు సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.. వాటిని పరిశీలిస్తే.. స్టేట్ క్యాడర్ ఆఫీసర్‌ను కేంద్రానికి నిర్దేశిత సమయంలోగా పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసినట్లయితే, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి క్యాడర్ నుంచి ఆ అధికారి రిలీవ్ అవుతారు అనేది ఒకటి రాగా.. కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటేషన్‌పై వాస్తవంగా ఎంత మంది అధికారులను పంపించాలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, అటువంటి అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలన్నది రెండో పాయింట్.. ఇక. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదరకపోతే, తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట గడువులోగా అమలు చేయాలన్నది మూడో అంశం కాగా.. నిర్దిష్ట పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి క్యాడర్ ఆఫీసర్ల సేవలు అవసరమైనపుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిర్దిష్ట గడువులోగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంటుంది. వీటిపైనే బీజేపీయేతర రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.