Smriti Irani: పార్లమెంట్ ఉభయ సభల్లో అంతరాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆయనెప్పుడూ పార్లమెంట్లో గళం వినిపించింది లేదని… ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదని ఆమె మండిపడ్డారు. ఎప్పుడూ పార్లమెంట్ కార్యకలాపాలను అగౌరవపరుస్తూ వస్తున్నాడని ఆరోపించారు. పార్లమెంట్లో 40% కంటే తక్కువ హాజరు ఉన్న వ్యక్తి ఆయనేని. అలాంటి రాజకీయంగా ఉత్పాదకత లేని వ్యక్తి.. ఇప్పుడు పార్లమెంటులో చర్చ జరగకుండా చూసుకోవడానికి తనను తాను అంకితం చేసుకుంటున్నాడంటూ స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.
జీఎస్టీ పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఇతర సమస్యలపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో నిరసనలు చేస్తుండగా.. స్మృతి ఇరానీ ప్రత్యేకంగా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. వయనాడ్కు వెళ్లిన తర్వాత పార్లమెంట్లో ఎలాంటి ప్రశ్నలూ అడగలేదన్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఆయన హాజరు కేవలం 40 శాతం మాత్రమేనని ఆమె విమర్శించారు. రాహుల్ గాంధీ రాజకీయ చరిత్ర మొత్తం పార్లమెంటరీ విధానాన్ని, రాజ్యాంగబద్ధమైన విధానాలను అగౌరవపరచడంతోనే నిండిపోయిందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను ముందుకు తీసుకురావడానికి పార్లమెంట్ ఒక ఉత్పాదక వేదిక అని మంత్రి వెల్లడించారు.
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఖరేంటి ? ఎవరికీ మద్దతిస్తారు ?
మంగళవారం రాహుల్ గాంధీ ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెరుగుదలకు వ్యతిరేకంగా పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు ప్రతిపక్షాల నిరసనలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి ప్రభుత్వం నిత్యావసర ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. వర్షాకాల సమావేశాల మొదటి రోజు ఉభయ సభల్లో ప్రతిపక్షాల గందరగోళం ఏర్పడింది, అవి కొన్ని గంటల్లోనే వాయిదా పడ్డాయి. జులై 18న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.