కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. త్రిష కథానాయిక. అభిరామి, శింబు కీలక పాత్రల్లో నటించారు. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా జూన్ 5న ఇది విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా పెంచేశారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. తాజాగా మీడియాతో ముచ్చటించారు మూవీ టీం. ఆ కార్యక్రమంలో భాగంగా మణిరత్నం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..
దక్షిణాదిలో అందులోనూ కోలీవుడ్‌ల్లో రజనీకాంత్, కమల్హాసన్, మణిరత్నం ఇలా చెబుతూ వెళితే ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. మరి అయినా కూడా ఎందుకు రూ.1000 కోట్ల (బాక్సాపీస్ కలెక్షన్స్) సినిమాలు చేయడం లేదు? అని విలేకరులు ప్రశ్నించగా మణిరత్నం తన అభిప్రాయాన్ని తెలియజేశారు.. ‘భారీ కలెక్షన్స్ రాబట్టే సినిమాలు చేయడం ముఖ్యమా? లేదంటే ప్రేక్షకుల మదికి చేరువయ్యే సినిమాలు చేయడం ముఖ్యమా? ఆలోచించండి. ఒక్కప్పుడు సినిమాలు అద్యంతం ప్రేక్షకులను అలరించేవి. కానీ, ఇప్పుడు అలా లేదు మొత్తం మూడు గంటల సినిమాల్లో కొన్ని అంశాలు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. అది కాకుండా, అప్పట్లో ఏదైనా సినిమా విడుదలైతే ప్రేక్షకులు అందులో కంటెంట్ ఏమిటి? దానిని ఎలా తెరకెక్కించారు అనే దానిపై దృష్టి పెట్టేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు. అంతా వ్యాపార కోణంలో చూస్తున్నారు. రానున్న రోజుల్లో సినిమా క్వాలిటీని దెబ్బతీసే విధంగా ఇది మారకూడదని ఆశిస్తున్నా. బాక్సాపీస్ నంబర్ కోసమే సినిమా చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ప్రేక్షకులకు గుడ్ ఫీల్ మూవీ మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నాను’ అని మణిరత్నం తెలిపారు.