Vice President Election :
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు మద్దతుగా నిలిచింది టీఆర్ఎస్. హైదరాబాద్ వచ్చిన యశ్వంత్‌కు ఘన స్వాగతం పలికింది కూడా. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కూడా ముగియడంతో… ఇక తేలాల్సింది ఫలితాలే. ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల హడావుడి మొదలైంది. NDA తరఫున జగదీప్ ధనఖడ్ బరిలో ఉంటే.. విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్‌కు చెందిన మార్గరెట్ ఆళ్వా నామినేషన్ వేశారు. దీంతో టీఆర్ఎస్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం విపక్ష పార్టీలు రెండుసార్లు సమావేశాలు నిర్వహిస్తే టీఆర్ఎస్ వెళ్లలేదు. కానీ.. శరద్ పవార్ కోరడంతో యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చింది.. ఆయన నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు టీఆర్‌ఎస్ నాయకులు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్షాలు నిర్వహించిన సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. అక్కడ మార్గరెట్ ఆళ్వా పేరు ఖరారు చేసినా.. టీఆర్‌ఎస్ నిర్ణయం వెల్లడించలేదు. తర్వాత చెబుతామని అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎంపీలు. తాజాగా మార్గరెట్ ఆళ్వా నామినేషన్ వేస్తే టీఆర్‌ఎస్ ప్రతినిధులు వెళ్లలేదు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఏం చేస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.
2014 లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది .రాంనాథ్ కొవింద్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం.. వెంకయ్యనాయుడు తెలుగువ్యక్తి కావడంతో మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది టీఆర్ఎస్. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారాయి. ఎన్డీయే అభ్యర్థులకు మద్దతివ్వడం లేదు. పైగా ప్రత్యామ్నాయ అజెండా పేరుతో జాతీయస్థాయిలో సత్తా చాటేందుకు చూస్తోంది గులాబీ పార్టీ. ఇందుకోసం బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరంగా ఉండాలన్నది ఆ పార్టీ నిర్ణయం. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య వాగ్యుద్ధం తీవ్రస్థాయిలోనే ఉంది. అలాంటప్పుడు మార్గరెట్ ఆళ్వాకు మద్దతిస్తుందా అనేది ప్రశ్న.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం ఎంపీలే ఓటు వేస్తారు. సంఖ్యా పరంగా చూస్తే NDAకు పూర్తి మెజారిటీ ఉంది. కానీ సిద్ధాంత వైరుధ్యంలో భాగంగా విపక్షాలు అభ్యర్థిని బరిలో నిలిపాయి. కాకపోతే ఆ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నేత కావడంతోనే టీఆర్‌ఎస్ వెంటనే ఏ నిర్ణయం వెల్లడించలేని పరిస్థితి వచ్చింది. దీంతో మార్గరెట్ ఆళ్వాకు మద్దతిస్తారా లేక పోలింగ్‌కు దూరంగా ఉంటారా లేక మరోదైనా సంచలన నిర్ణయం ఉంటుందా అనేది కాలమే చెప్పాలి.