DK Shivakumar: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుక వేళ కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక జరగనున్న జనవరి 22న ప్రభుత్వ సెలువు దినంగా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఆ రోజు సెలవు ఇచ్చేదడి లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమర్థించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ..‘‘మేము మా భక్తి, మా గౌరవం, మా మతాన్ని ప్రచారం చేయము. ఇలా చేయమని ఎవరూ మమ్మల్ని అడగ లేరు. కానీ మా మంత్రులు దేవాలయాల్లో పూజలు చేస్తారు. మా ప్రార్థనలు ఫలిస్తాయి. ప్రతీ ఒక్కర్ని ప్రార్థనలు చేయాలని మేము కోరుతున్నాము’’ అని డీకే శివకుమార్ అన్నారు.
సీఎం సిద్ధరామయ్య పేరులో రాముడు, నా పేరులో శివుడు ఉన్నారు, ఎవరూ మాకు నేర్పించాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఒత్తిడి చేయకూడదు, మా డ్యూటీ మేం చేస్తామని ఆయన బీజేపీ డిమాండ్‌పై బదులిచ్చారు. జనవరి 22న అయోధ్య వేడుక నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడంపై బీజేపీ, కాంగ్రెస్‌ని టార్గెట్ చేసింది. దేశంలోని పలు రాష్ట్రాలు ఆ రోజున సెలవు ప్రకటించాయి.
రామ మందిర వేడుకలకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ హాజరుకావడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. రామ మందిర ట్రస్టు నుంచి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానం అందినా, వారు ఈ వేడుకకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఇది బీజేపీ/ఆర్ఎస్ఎస్ సొంత కార్యక్రమంలా ఉందని అందుకే వెళ్లడం లేదని చెప్పారు. మరోవైపు శివకుమార్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎవరెవరూ రావాలో అనే అంశంపై ‘పిక్ అండ్ చూస్’ పద్దతిని అవలంబిస్తోందని, రామ మందిరం ప్రైవేట్ ఆస్తి కాదని, అది ప్రజలదని అన్నారు.