Russia Says Oil Sales To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసి, రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీద్దాం అనుకున్న అమెరికా, యూరోపియన్ దేశాలకు ప్లాన్ బెడిసికొట్టింది. భారత్, చైనా రూపంలో బలమైన మార్కెట్లను రష్యా ఆదాయంగా మలుచుకుంది. ఈ రెండు దేశాలకు కావాల్సిన చమురును అత్యంత చౌకగా రష్యా అందిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రష్యా నుంచి భారత్ కు క్రూడ్ ఆయిల్ దిగుమతులు పెరిగాయి.
Read Also: Kim Jong Un: కిమ్ చేష్టలు.. బుల్లెట్లు మిస్సైనందుకు ఏకంగా నగరం మొత్తం లాక్‌డౌన్
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ దేశాలు రష్యా నుంచి సహజవాయువు, చమురు కొనుగోలును ఆపేశాయి. అప్పటి నుంచి రష్యా భారత్ కు చమురును సరఫరా చేస్తోంది. భారత్ కు చమురు అమ్మకాలు 20 రెట్లు పెరిగినట్లు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ తెలిపారు. గ్రూప్ ఆఫ్ సెవన్ దేశాలు రష్యా చమురుపై ధర పరిమితి విధించింది. సముద్ర మార్గాల ద్వారా రష్యన్ చమురు సరఫరాపై ఆంక్షలు విధించింది.
కాగా.. మా ఇంధన వనరులను ఇతర మార్కెట్లు, స్నేహపూర్వక దేశాల మార్కెట్లకు మళ్లించబడ్డాయని ఉప ప్రధాని అన్నారు. మనం భారతదేశానికి చేస్తున్న చమురు సరఫరా 22 రెట్లు పెరిగిందని ఆయన అన్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలకు ప్రతిస్పందనగా ఈ నెలలో ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 5 లక్షల బ్యారెళ్లకు రష్యా తగ్గించింది. రోజూవారీ ఉత్పత్తిలో 5 శాతం ఉత్పత్తి తగ్గింపు జూన్ వరకు కొనసాగుతుందని నోవాక్ గత వారం ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరిలో రష్యా చమురు-ఎగుమతి ఆదాయం దాదాపు సగానికి పడిపోయిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఈ నెలలో పేర్కొంది.