దేశంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలపై బుధవారం రాజ్యసభలో ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జెనీవాలోని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ విడుదల చేసిన వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ (డబ్ల్యూఆర్‌ఎస్) 2018 ప్రకారం.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. మరోవైపు రోడ్డుప్రమాదాల్లో క్షతగాత్రుల విషయంలో మాత్రం భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు. 2020 సంవత్సరానికి 18 నుండి 45 సంవత్సరాల మధ్య రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం 69.80 శాతంగా ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
మరోవైపు రోడ్ల అభివృద్ధిపై రాజ్యసభలో ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ.. దేశంలో మొత్తం 22 గ్రీన్‌ఫీల్డ్ హైవేలను రూ. 1,63,350 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అటు 2,485 కి.మీ పొడవుతో కూడిన 5 ఎక్స్‌ప్రెస్‌వేలతో పాటు 5,816 కి.మీ పొడవుతో కూడిన 17 యాక్సెస్-నియంత్రిత హైవేలను రూ. 1,92,876 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఛాసిస్ నంబర్ ఆధారంగా వాహన వినియోగదారులకు ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేయబడుతుందని గడ్కరీ వివరించారు. మార్చి 30, 2022 నాటికి, వివిధ బ్యాంకులు జారీ చేసిన మొత్తం ఫాస్ట్‌ట్యాగ్‌ల సంఖ్య 4,95,20,949గా, జాతీయ రహదారులపై ఉన్న ఫీజు ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ వ్యాప్తి దాదాపు 96.5 శాతంగా ఉందని గడ్కరీ పేర్కొన్నారు.