Rajasthan Political Crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష పదవిలో పోటీ చేస్తారని అనుకుంటున్నప్పటికీ.. ఆయన సీఎం పదవిని వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. సచిన్ పైలెట్ సీఎం కావడం అశోక్ గెహ్లాట్ కు మొదటినుంచి ఇష్టం లేదు. సచిన్ పైలెట్ ను ముఖ్యమంత్రి చేయవద్దనే డిమాండ్ పై గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు మొండిగా వ్యవహరిస్తున్నారని.. పార్టీ పరిశీలకుడు అజయ్ మాకెన్ అన్నారు. అక్టోబర్ 19 తర్వాత నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ కు సూచిస్తామని ఆయన అన్నారు.
గెహ్లాట్ కు మద్దతుగా 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానం ముందు మూడు షరతులు పెట్టారు. గెహ్లాట్ రాజీనామా తర్వాత ఆయన అనుకూల వర్గం నుంచే ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని.. ముఖ్యమంత్రి నియామకం విషయంలో ఆయన సూచనలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విధంగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాతే అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు.
Read Also: kerala Hijab Protest: కేరళను తాకిన హిజాబ్ వివాదం..ముస్లిం సంఘాల ఆందోళన
ఇదిలా ఉంటే తరుపరి సీఎం సచిన్ పైలెట్ అని అధిష్టానం తెలియజేయడంతో గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడ్డారు. కాగా.. సచిన్ పైలెట్ కు హైకమాండ్ నుంచి ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చింది. అయితే తాను ఢిల్లీకి వెళ్లేది లేదని ఆయన తెలిపారు. చర్చల కోసం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్లను ఢిల్లీకి రావాలని హైకమాండ్ కోరింది. మరోవైపు అశోక్ గెహ్లాట్ తదుపరి సీఎంగా స్పీకర్ సీపీ జోషి, బీడీ కల్లా పేర్లను సూచించారు.
రాజస్థాన్ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని కోరుతున్నారు. ఈ గొడవలను చక్కదిద్దే పనిలో పడ్డారు కాంగ్రెస్ నాయకులు. కాసేపట్లో సోనియాగాంధీతో కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య ఉన్న ఎప్పటి నుంచో ఉన్న వివాదం తాాజాగా అధ్యక్ష ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య వివాదం రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని తీసుకువచ్చింది.