Bride flee: కొనుకున్న కొత్త కోడలు అత్తామామలకు మత్తు మందు కలిపి ఇచ్చి పరారైంది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. బుండీ జిల్లాలో ఓ నవ వధువుల తన అత్తామామలకు ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి, వారు మత్తులోకి జారుకున్న తర్వాత ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులు శుక్రవారం తెలిపారు. మంజూబాయి(24)అనే యువతి అత్తమామలతో పాటు ఆరేళ్ల చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత బైక్ తీసుకుని పారిపోయింది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని బంధువులు గుర్తించి ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.
Read Also: Duleep Trophy: సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
దుర్గా శంకర్ గుర్జర్(24) అనే వ్యక్తి ఆగస్టు 23న మంజుబాయిని ‘‘నాట-ప్రథ’’ పద్ధతిలో వివాహం చేసుకున్నాడని డబ్లానా ఏఎస్ఐ మహేంద్ర యాదవ్ తెలిపారు. నాట-ప్రథ అనేది రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని కమ్యూనిటీల్లో అమ్మాయిలను స్టాంప్ పేపర్‌పై కొనుక్కోవడం లేదా వివాహం పేరుతో అమ్మకం చేసే పద్దతి. ఇంటి ముందు పార్క్ చేసిన బైకులో ఆమె పారిపోయిందని, ఇంట్లో నుంచి నగలు, నగదు తీసుకెళ్లిందా..? అనేదానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామని, మంజూబాయి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.