Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించి, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. ఠాక్రేలతో బీజేపీకి ఉన్న సంబంధాల గురించి ఆయన వ్యాఖ్యానించారు. ‘‘గతంలో ఉద్ధవ్ ఠాక్రే ఒక స్నేహితుడు, ఇప్పుడు రాజ్‌ఠాక్రే స్నేహితుడు, కానీ ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదు’’ అని అన్నారు. శివసేన, బీజేపీ చాలా కాలంగా మిత్రులుగా ఉన్నప్పటికీ, 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత విడిపోయాయి. ఆ తర్వాత శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో రెండుగా చీలింది. ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని బీజేపీకి దూరమైంది. శివసేన ఠాక్రేతో బీజేపీ విడిపోవడంతో ఉద్ధవ్ ఠాక్రే బంధువు ‘‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్)’’ రాజ్‌ఠాక్రే బీజేపీకి దగ్గరయ్యారు.
Read Also: Nalgonda Intelligence SP: నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు..
ఇదే విధంగా శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసిపోయే అవకాశాలపై ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 2019, 2024 మధ్య జరిగిన పరిణామాలను గమనిస్తే, ఏదైనా జరగొచ్చని తాను అనుకున్నానని, ఉద్ధవ్ ఠాక్రే వేరే కూటమిలోకి వెళ్తారని, అజిత్ పవార్ మా దగ్గరకు వస్తారని అనుకున్నా. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని చెప్పారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలలో ఎవరు కఠినంగా ఉంటారనే దానికి సమాధానంగా.. ప్రధాని చాలా క్రమశిక్షణ కలిగిన రాజకీయ వ్యక్తి అని, అయితే అప్పుడప్పుడు ఎవరైనా అమిత్ షాని ఒప్పించగలరని ఆయన అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బీజేపీ నుంచే ఉంటారనే ప్రతిపాదనకు, ఏక్‌నాథ్ షిండే నిమిషాల్లోనే అంగీకరించారని అన్నారు.