Nalgonda Intelligence SP: నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ ఆఫీసుకి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణలతో ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఇంటలిజెన్స్ ఎస్పీ భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు టాక్. ఆమె అవినీతిపై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు 9 పేజీల లేఖను రాశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్‌ల కోసం లంచాలు తీసుకున్నట్లు ఆరోపించారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లు వారు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ఆధారంగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.
Read Also: Tamim Iqbal Retirement: బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ ప్లేయర్
అయితే, నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా గంజి కవిత ఏడేళ్ల పాటు విధులు నిర్వహించారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి పెద్ద మొత్తంలో వసూల్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. అలాగే, ఓ ఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా కొనసాగించినట్లు సమాచారం. దీంతో గంజి కవిత షాడో టీంపైనా దర్యాప్తు కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు, నల్లగొండ, సూర్యపేట జిల్లాల నూతన ఇంటలిజెన్స్ అధికారిగా శ్రీనివాసరావు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.