Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగించాలా? లేక డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగించాలా? అని కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కర్ణాటక పంచాయతీ కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 1 పార్లమెంట్ సమావేశానికి ముందు సీఎం ఎవరనేది కాంగ్రెస్ నిర్ణయించనుంది. రాహుల్ గాంధీని కలిసేందుకు వారం రోజులుగా డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో రాహుల్ నుంచి డీకేకు మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ ‘‘ దయచేసి వేచి ఉండండి, నేను మీకు కాల్ చేస్తా’’ అని డీకేకు వాట్సాప్ టెక్ట్స్ మెసేజ్ పంపించారు.
Read Also: The Pet Detective : ఓటీటీలోకి అనుపమ సూపర్ హిట్ సినిమా
మరోవైపు, డీకే నవంబర్ 29న ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సోనియాగాంధీతో అపాయింట్మెంట్ కొరినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ కర్ణాటక కాంగ్రెస్ నేతలు ప్రియాంక్ ఖర్గే, శరత్ బచ్చేగౌడతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత, ప్రియాంక్ ఖర్గేతో మరో 20 నిమిషాల పాటు రాహుల్ గాంధీ ప్రైవేట్‌గా మాట్లాడారు. రెండు శిబిరాలు కూడా సంయమనం పాటించాలని ప్రియాంక్‌తో రాహుల్ చెప్పారని తెలుస్తోంది.
ఒక వేళ నాయకత్వ మార్పు జరిగితే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. కీలక సామాజిక వర్గాల నుంచి వ్యతిరేక నివారించడానికి ఒక వేళ డీకే శివకుమార్ సీఎం అయితే, పార్టీలో మిగతా వర్గాల వారికి కీలక పోస్టులు ఇచ్చేలా ఒక ఫార్ములాను కాంగ్రెస్ అణ్వేషిస్తోంది. కర్ణాటక పీసీసీ పదవి, డిప్యూటీ సీఎం పదవుల్ని ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాల నాయకులకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.