త్వరలో ఎన్నికల సంఘంపై హైడ్రోజన్ బాంబ్ పేల్చబోతున్నట్లుగా ప్రకటించినట్టుగానే గురువారం రాహుల్‌గాంధీ పేల్చారు. ఓట్ల చోరీపై గతంలో కొన్ని ఆధారాలు బయటపెట్టగా.. ఈరోజు మరిన్ని ఆధారాలను బయటపెట్టారు. మీడియా ముందు వీడియో ప్రజెంటేషన్ ఇస్తూ… ఓట్ల చోరీపై 100 శాతం ఆధారాలతో రుజువులు బయటపెడుతున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Obama: చార్లీ కిర్క్ హత్యపై ఒబామా కీలక వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా లక్షలాది ఓట్లు తొలగించాలని కొంత మంది కంకణం కట్టుకున్నారని.. దానికి ఎన్నికల సంఘం వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే ఈసీ కళ్లప్పగించి చూస్తోందని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోతే.. ఇంకొక రాష్ట్రంలో.. ఇలా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సమయానికి లక్షలాది మంది ఓట్లను తొలగిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఇందుకోసం కేంద్రీకృత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి.. కాంగ్రెస్ బూత్‌ల నుంచి ఓట్లు తొలగించారని వివరించారు.
ఇది కూడా చదవండి: Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. అయినా మగువలకు నిరాశే!
ఇందుకు ప్రత్యేక ఉదాహరణగా 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంక్ ఉన్న బూత్‌ల నుంచి వేలాది ఓట్లు తొలగించినట్లు వెల్లడించారు. వేరే రాష్ట్రాల ఫోన్ నెంబర్లు, నకిలీ లాగిన్‌లు ఉపయోగించి ఓటర్ పేర్లు తొలగించారన్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఉపయోగించారని స్పష్టం చేశారు.
‘‘ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నికలో.. భారతదేశం అంతటా లక్షలాది మంది ఓటర్లను.. వివిధ వర్గాలను, ప్రధానంగా ప్రతిపక్షానికి ఓటు వేస్తున్న వర్గాలను, తొలగింపు కోసం ఒక సమూహం క్రమపద్ధతిలో లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనికి మేము 100 శాతం రుజువును కనుగొన్నాము. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాను. ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రేమిస్తున్నాను. నేను ఆ ప్రక్రియను రక్షిస్తున్నాను. మీరు నిర్ణయించగల 100 శాతం రుజువు ఆధారంగా కాకుండా నేను ఇక్కడ ఏమీ చెప్పబోవడం లేదు. తీర్పు మీదే.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఎవరో 6,018 ఓట్లను తొలగించడానికి ప్రయత్నించారని.. చివరికి ఎవరో పట్టుబడ్డారన్నారు. ఇది చాలా నేరాల మాదిరిగానే యాదృచ్చికంగా పట్టుబడినట్లు తెలిపారు. ఈ తొలగింపు ప్రయత్నాలు కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచే బూత్‌ల్లోనే జరిగిందని వివరించారు. గోదాబాయి పేరుతో ఎవరో నకిలీ లాగిన్ సృష్టించి 12 మంది ఓటర్ల పేర్లు తొలగించారన్నారు. కానీ ఈ విషయం గోదాబాయికి తెలియదని చెప్పారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్ నెంబర్ల ద్వారా ఈ తతాంగం అంతా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వారంలోపు ఈసీ డేటా విడుదల చేయాలని.. లేకపోతే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నవారిని రక్షిస్తున్నారని భావించాల్సి ఉంటుందని తెలిపారు.