Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ‘‘శ్రీరాముడి’’ ఉనికి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ఒక యూనివర్సిటీలో జరిగిన సంభాషణలో మాట్లాడుతూ.. ‘‘ రాముడు పురాణాలకు చెందిన వ్యక్తి’’గా అభివర్ణించారు. రాముడు పాత్ర కల్పితం అని అర్థం వచ్చేలా మాట్లాడటంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక మనస్తత్వం కలిగిన వాడని, రాముడి వ్యతిరేకి అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
బ్రౌన్ యూనివర్సిటీలోని వాట్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ జాతీయవాదం ఆధిపత్యం చెలాయించే యుగంలో అన్ని వర్గాలను స్వీకరించే లౌకిక రాజకీయాలు ఎలా రూపొందించాలి..? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని గొప్ప సామాజిక సంస్కర్తలు, రాజకీయ ఆలోచనపరులు మతభ్రష్టులు కాదని గాంధీ అన్నారని, బీజేపీ ఆలోచనను హిందూగా తాను పరిగణించనని అన్నారు.
‘‘మన పురాణాల్లోని రాముడు క్షమించే గుణం కలవాడని, బీజేపీ చెప్పేది హిందూ ఆలోచన అని నేను అస్సలు పరిగణించను. హిందూ ఆలోచన అంటే నేను బహుత్వవాదం, ఆలింగనం చేసుకోవడం, ఎక్కువ అప్యాయత, ఎక్కువ సహనం. ప్రతీ దేశంలో అలాంటి ఆలోచన కోసం నిలబడి, జీవించి, ఆ ఆలోచన కోసం మరణించిన వారిని చూశాము. గాంధీ వారిలో ఒకరు.’’ అని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ భావనను తాను హిందూ భావనగా చూడనని అన్నారు.
Read Also: India Pakistan: “మోడీ ఏమైనా నా అత్త కొడుకా.? యుద్ధం వస్తే నేను ఇంగ్లాండ్ పారిపోతా”: పాక్ ఎంపీ..
అయితే, ఈ ఇంటర్వ్యూ లోని ఒక క్లిప్‌ని బీజేపీ షేర్ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎక్స్ లో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ‘‘హిందువులను మరియు రాముడిని అవమానించడం కాంగ్రెస్ పార్టీ గుర్తింపుగా మారింది. అఫిడవిట్ ద్వారా రాముడి ఉనికిని తిరస్కరించిన వారు, రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు, ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదబంధాన్ని సృష్టించిన వారు ఇప్పుడు రాహుల్ గాంధీని ‘పౌరాణికం’ అని అన్నారు. రాహుల్ గాంధీ,సోనియా గాంధీ రామమందిర ప్రతిష్టకు హాజరు కాలేదు. ఇది వారి రామ వ్యతిరేక, హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని చూపిస్తుంది. వారు పాకిస్తాన్ భాషను మాట్లాడతారు, సైన్యం నైతికతను దెబ్బతీస్తారు. వారు రాముడికి వ్యతిరేకులు,భారతదేశ వ్యతిరేకులు, ప్రజలు దీనిని క్షమించరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. ‘‘ప్రభు శ్రీరాముడు కేవలం పౌరాణిక వ్యక్తి: ఇది కాంగ్రెస్ మనస్తత్వం. హిందూ విశ్వాసాలను అపహాస్యం చేయడం, రాముడిని ప్రశ్నించడం, ఎన్నికలు రాగానే సనాతన ప్రేమను నటించడం. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి’’ అని కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. మరో అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్, 2007లో రాముడికి చారిత్రక రుజువలు లేవని కాంగ్రెస్ సుప్రీంకోర్టులో అఫిడపిట్ దాఖలు చేసిన విషయాన్ని ఎత్తిచూపారు. రాముడు ఏ ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడో లేదా ఆయన ఏ వంతెనను నిర్మించాడో తెలిపే చరిత్ర లేదని కాంగ్రెస్ మిత్రపక్షం డిఎంకె రాముడిని ఎగతాళి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.