Priyanka Gandhi: దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 180 సీట్లకు మించి రావని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు సాధిస్తుందనే నినాదాన్ని ఆమె బుధవారం తోసిపుచ్చారు. బీజేపీకి 400 స్థానాలు వస్తాయని చెప్పుకోవడంలో ఆధారమేంటని ప్రశ్నించారు. వారు ఏదైనా తప్పు చేశారా, ఇప్పటికే ఫలితాలు తెలుసా?? అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీజేపీ వారేమైనా జ్యోతిష్కులా..? అని ప్రశ్నించారు. ఈ దేశంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగని విధంగా ఎన్నికలు జరిగితే, ఆ పార్టీకి 180 సీట్లు కూడా రావని ఆమె అన్నారు.
Read Also: CM Revanth Reddy: రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని.. 20 ఏళ్లు ఆయనే ఉంటారు..
ఆమె యూపీలోని సహరాన్‌పూర్‌లో ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఇమ్రాన్ మసూద్‌కి మద్దతుగా ప్రచారం చేశారు. ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయని ప్రశ్నించగా.. తాను జ్యోతిష్యురాలిని కాదని చెప్పారు. కానీ మంచి సంఖ్యలో సీట్లు వస్తాయని అన్నారు. గత 10 ఏళ్లుగా ప్రజలు తమ జీవితాల్లో ఎలాంటి అభివృద్ధిని చూడలేదని, ప్రధాని మోడీ ప్రజలతో సంబంధం లేకుండా చేశారని, ఈ సారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆమె అన్నారు.
‘‘ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వారికి ఇలాంటి రాజకీయాలు అక్కర్లేదు. గత 10 ఏళ్లలో ఏ ఒక్క సామాన్య వ్యక్తి లేదా మహిళ జీవితంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. వారికి ఉద్యోగాలు రావడం లేదు, ద్రవ్యోల్బణం తగ్గడం లేదు. ఈ రోజు శ్రీరామ నవమి ప్రజలు ఏదైనా కొనేందుకు కూడా వారి దగ్గర డబ్బు లేదు. ఆయన(పీఎం మోడీ) చుట్టూ ఉండేవారు ఈ విషయాన్ని చెప్పడం లేదని నేను అనుకుంటున్నాను. అతను ప్రజలతో సంబంధాన్ని కోల్పోయారు’’ అని ప్రియాంకా గాంధీ అన్నారు.