PM Modi: భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో నిన్న (గురువారం) రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా, ఈరోజు (డిసెంబర్ 27) ఆయన పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధాని మోడీతో పాటే కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఇతరులు మన్మోహన్ సింగ్ నివాసానికి వచ్చారు.
Read Also: Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
అయితే, మన్మోహన్ సింగ్ గురువారం నాడు సాయంత్రం ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో అతన్ని కుటుంబ సభ్యులు హుటాహుటీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఇక, మన్మోహన్ సింగ్ 2004-2014 వరకు పదేళ్ల పాటు దేశానికి ప్రధాన మంత్రిగా సేవలందించారు. అంతకుముందు ఆర్‌బీఐ గవర్నర్‌గా విధులు నిర్వహించారు. అలాగే, ప్రధానిగా పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగానూ పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచికంగా 7 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ప్రజల సందర్శనార్థం రేపు (శనివారం) ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకు వెళ్లనున్నారు. రేపు (డిసెంబరు 28) రాజ్‌ఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.