ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారత సైన్యం 577 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా నవంబర్ 25, 2021 నాటికి అర్హత కలిగిన 63 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేశామని, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ సందర్భంగా దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. ఎక్కువ మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఆర్మీలో మహిళలు పెద్ద స్థాయిలను పొందడానికి, కమాండ్ పదవులను నిర్వహించడానికి మరింత మార్గం సుగమం చేస్తుందన్నారు.
ఇదివరకు ప్రభుత్వం మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయలేదన్నారు. గత ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయకపోవడానికి విచిత్రమైన కారణాలను తెలిపిందన్నారు. ఫార్వర్డ్ ఏరియాల్లో పేలవమైన పరిశుభ్రత, మాతృత్వం,పిల్లల సంరక్షణ, ఒంటరి జీవితాన్ని గడపడం మరియు గ్రామీణ నేపథ్యాల నుండి వచ్చిన దళాలు మహిళా అధికారులను కమాండర్‌లుగా అంగీకరించకపోవడం వంటి కారణాలు చూపించిందన్నారు.
ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD), సిగ్నల్స్, ఇంజనీర్లు, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీర్లు (EME), ఆర్మీ సర్వీస్ కార్ప్స్ (ASC), ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ వంటి స్ట్రీమ్‌లలో షార్ట్ సర్వీస్ కమిషన్డ్ (SSC) మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయడాన్ని అనుమతించిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత పురుష మరియు మహిళా అధికారులకు సేవా పరిస్థితులలో సమతుల్యతను తీసుకురావడానికి శిక్షణ, శారీరక దారుఢ్యం మరియు పోస్టింగ్‌లు మరియు సర్వీస్ కోర్సులు వంటి సమస్యలపై సైన్యం తన విధానాన్ని కూడా సవరించిందని మంత్రి తెలిపారు.