Pakistan Spy: హర్యానా యూట్యూబర్, పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ దొరికిన జ్యోతి మల్హోత్రా పట్టుబడటం సంచలనంగా మారింది. ఆమె అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్తాన్ గూఢచారులు పట్టుబడుతున్నారు. రాజస్థాన్‌కి చెందిన కాసిం, అతడి సోదరుడు అసిం పాకిస్తాన్ తరపున గూఢచర్యానికి పాల్పడనున్నట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాసిం పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి శిక్షణ పొందడానికి రెండుసార్లు పాకిస్తాన్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
కాసిం పాకిస్తాన్‌కు చెందిన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతున్నట్లు యూట్యూబ్ వీడియోలో కనిపించిన తర్వాత, ఇతడి పాకిస్తాన్ పర్యటన నిర్ధారణ అయింది. గురువారం రాజస్థాన్‌లోని మేవాట్ లోని డీగ్ ప్రాంతంలో కాసింను అరెస్ట్ చేశారు. ‘రెహ్‌బర్-ఎ-మేవాట్’ అనే యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో, పాకిస్తాన్ తనకు ‘‘ఇల్లులా అనిపించింది’’ అని కాసిం న్యూస్ యాంకర్‌తో చెప్పాడు.
“మిస్టర్ కాసిమ్, మరోసారి పాకిస్తాన్‌కు స్వాగతం. పాకిస్తాన్‌కు తిరిగి రావడం ఎలా అనిపిస్తుంది?” అని యాంకర్ అతనిని అడిగాడు. దీనికి సమాధానంగా కాసిమ్ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు ఇల్లులా అనిపిస్తుంది. నాకు ఇక్కడ చాలా ప్రేమ, ఆప్యాయత లభిస్తుంది. ఇదే తను మళ్లీ తిరిగి వచ్చేలా చేస్తోంది. మీ ప్రజల ప్రేమ, ఆప్యాయత కారణంగా మూడు నెలల కన్నా తక్కువ సమయంలోనే ఇక్కడికి తిరిగి వచ్చా’’ అని అన్నాడు.
Read Also: Elon Musk: 14 మంది కాదు అంతకు మించి, జపనీస్ పాప్ స్టార్‌తో మరో బిడ్డను కన్న ఎలాన్ మస్క్..
అధికారులు చెబుతున్న దాని ప్రకారం, కాసిమ్ మొదటిసారిగా ఆగస్టు 2024లో, మళ్లీ 2025లో పాకిస్తాన్ సందర్శించాడు. మొత్తం 90 రోజులు ఆ దేశంలో గడిపాడు. ఇతను ఐఎస్ఐ హ్యాండర్లు, సీనియర్ ఆపరేటివ్స్ నుంచి గూఢచర్య శిక్షణ పొందాడు. దర్యాప్తులో, కాసిం భారత సిమ్ కార్డులను పాకిస్తాన్ పంపుతున్నట్లు తేలింది. ఆ సమయంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOలు) వాటిని ఉపయోగించి సున్నితమైన సైనిక మరియు ప్రభుత్వ సంబంధిత సమాచారాన్ని సేకరించడానికి వాట్సాప్ ద్వారా భారతీయులను సంప్రదించేవారు. కాసిం భారతదేశంలో అనేక మందిని తీవ్రవాదం వైపు ఆకర్షించాడు. ఇతడికి విస్తృత నెట్వర్క్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. తర్వలో మరిన్ని అరెస్టులు జరుగుతాయని తెలుస్తోంది.
ఈ కేసులో కాసిం సోదరుడు ఆసిం కూడా పాక్ తరుపున గూఢచర్యం చేస్తున్నట్లు వెల్లడైంది. కాసింను విచారించేటప్పుడు అతని పేరు బయటపడింది. అసిం బంధువులను కలిసే నెపంతో పాకిస్తాన్ కు పదేపదే వెళ్లాడు. అతను అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లను సంప్రదించాడనే ఆరోపణలు ఉన్నాయి. తన కన్నా ముందు నుంచే తన సోదరుడు గూఢచర్యం చేస్తున్నట్లు పాక్ ఏజెంట్లు తనకు చెప్పినట్లు కాసిం పోలీసులతో వెల్లడించినట్లు తెలుస్తోంది.