Jammu Kashmir Encounter: జమ్మూకాశ్మీర్‌లో గత 24 గంటలుగా ఎన్‌కౌంటర్ జరుగుతోంది. రాజౌరి ప్రాంతంలో కలకోట్ అటవీ ప్రాంతంలో జరగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే నలుగురు ఆర్మీ జవాన్లు మరణించాగా.. గాయపడిన మరో సైనికుడు ఈ రోజు మరణించాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌కి చెందిన కీలక లష్కరే తోయిబా ఉగ్రవాది భద్రతాబలగాలు హతమార్చాయి. మరణించిన పాక్ ఉగ్రవాదిని ఖారీగా గుర్తించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచేందుకు ఇతను ప్రయత్నిస్తున్నాడు. ఐఈడీ తయారీలో శిక్షణ ఇవ్వడంతో పాటు అడవుల్లో గుహల్లో దాక్కోవడం వంటి వాటితో పాటు స్నైపర్ శిక్షణ ఇవ్వడంలో ఖారీ పేరుపొందినట్లు సైన్యం తెలిపింది.
ఖారీ పాకిస్తాన్, ఆఫ్ఘన్‌లో శిక్షణ పొందారు. లష్కరేతోయిబాలో అత్యంత ముఖ్యమైన ఉగ్రవాద నాయకుడిగా ఉన్నాడు. గత ఏడాది కాలంగా ఖారీ తన ఉగ్రవాద బృందంతో రాజౌరీ-పూంచ్ సెక్టార్లలో క్రియాశీలకంగా ఉన్నాడు. డాంగ్రీ, కంది దాడుల్లో ఇతను ప్రధాన సూత్రధారి.
Read Also: Central IT Department: కలకలం సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు.. రంగం లోకి కేంద్రం
బుధవారం జబిమల్ గ్రామంలోని స్థానిక గుజ్జర్ వ్యక్తి, ఉగ్రవాదులకు ఆహారం నిరాకరించాడు, దీంతో అతనిని ఉగ్రవాదుల కొట్టారు. ఈ విషయాన్ని అతను భద్రతాబలగాలకు చెప్పడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో భారీ యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు తప్పించకోకుండా అదనపు భద్రతా బలగాలను మోహరించారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు గాయపడినట్లు తెలుస్తోంది. సైనికులు చుట్టుముట్టడంతో సీనియర్ ఆర్మీ కమాండర్లు ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. మొదట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలు భావించినప్పటికీ.. వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
మరణించిన సైనికుల్లో, ముగ్గురు ప్రత్యేక దళాల కమాండోలు ఉన్నారు. సెప్టెంబర్ నెలలో అనంత్ నాగ్ జిల్లాలోని కోకెర్ నాగ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ లో కమాండింగ్ ఆఫీసర్, ఆర్మీ మేజర్, జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ మరణించారు. రాజౌరీ-పూంచ్ పీర్ పంజాల్ అటవీ ప్రాంతం 2003 నుంచి తీవ్రవాదం నుంచి బయటపడింది. అయితే 2021 నుంచి మళ్లీ తీవ్రవాద కార్యకలాపాలు మొదలయ్యాయి. గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో 30 మంది ఆర్మీ జవాన్లు మరనించారు. దట్టమైన అటవీ ప్రాంతాలు, గుహలు ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉంటున్నాయి. దీంతో ఆపరేషన్ చేసేందుకు వెళ్లిన సైన్యానికి ఈ ప్రాంతంలో ఎదురుదెబ్బలు తాకుతున్నాయి.