మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం విపక్షాలపైకి ఈడీని ఉసిగొల్పుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమది ఈడీ ప్రభుత్వమేనన్న ఆయన.. ఈడీ అంటే ‘ఏక్‌నాథ్-దేవేంద్ర’ ప్రభుత్వమని వివరణ ఇచ్చారు. వారిరివురి పేర్లలోని తొలి అక్షరాన్ని సూచిస్తూ అలా వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో అధికారం కోసం పోరాటాలు ఉండవని అన్నారు. సహకారంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో విజయం సాధించిన అనంతరం ఆయన ప్రసంగించారు.
ఈడీ అంటే ఏక్‌నాథ్ దేవేంద్ర ప్రభుత్వమని విపక్షాలకు తనదైన స్టయిల్‌లో కౌంటర్ ఇచ్చారు. బీజేపీ-శివసేన కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా.. తమ వద్ద మెజారిటీని విపక్షం లాక్కెళ్లినట్లు ఆరోపించారు. బీజేపీని కాదని కాంగ్రెస్, ఎన్సీపీతో ఉద్ధవ్ పొత్తు కట్టడాన్ని ఫడ్నవీస్ తప్పుపట్టారు.ఏక్‌నాథ్‌ను కలుపుకని మరోసారి శివసేనతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, నిజమైన శివసైనికుడే సీఎం అయ్యారని ఫడ్నవీస్ అన్నారు. తమ పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం తాను డిప్యూటీ సీఎం అయినట్లు ఫడ్నవీస్ తెలిపారు. గతంలో తమ పార్టీ తనను సీఎంను చేసిందని, ఇప్పుడు ఇంటి వద్ద ఉండమన్నా ఉండేవాడినన్నారు. ఔరంగాబాద్ పేరు మారుస్తూ గత కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తామని చెప్పారు. గత కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు మాకు ఆమోదయోగ్యమైనవే.. కానీ వాటిని నిబంధనల ప్రకారం తీసుకోలేదని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.