ఎండలతో సతమతం అవుతున్న ప్రజానీకానికి ఐఎండీ చల్లని కబురు అందించింది. భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం చేశాయని ఐఎండీ తాజాగా వెల్లడించింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్లు వివరించింది. అంతేకాకుండా బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడుకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా కేరళను తాకనున్న రుతుపవనాలు జూన్ తొలివారంలో తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బాలాజీ జిల్లా చంద్రగిరిలో భారీగా ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. దీంతో కాల్వలు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అటు ఏపీ సరిహద్దు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో భారీ వర్షం పడుతోంది. 64వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.