తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారుతున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫార్మ్ హౌజ్ కే పరిమితం అవుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కార్యక్రమానికి హాజరైన సీతక్క టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీ అటవీ హక్కుల చట్టాన్ని తీసుకువచ్చి పట్టాలు ఇస్తే నేడు ఆ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. స్థానిక సమస్యలను పట్టించుకోకుడా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో డబ్బాలు పలుకుతూ టైంను కేటాయిస్తున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు మూడెకరాల భూమి లేదు.. ప్రభుత్వ ఉద్యోగాలు లేవని విమర్శిచారు. పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్రం ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుంటుందని ఆరోపించారు. పబ్ లు, క్లబ్ లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా.. ప్రభుత్వం నిద్ర పోతుందని ఆరోపించారు. సాక్షాత్తు ప్రభుత్వ వాహనాల్లో అత్యాచారం చేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. హైదరాబాద్ లో అత్యాచార ఘటన జరిగి పదిరోజులు దాటినా ఇప్పటి వరకు అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా దాచి పెడుతున్నారని విమర్శించారు.
ప్రజలకు భద్రత కల్పించే విషయంలో కాకుండా ప్రతిపక్షాలపై నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ వచ్చాక రోడ్ పై మర్దర్లు, పరువు హత్యలు జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్ అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయకుండా, దోషులను శిక్షించకుండా తప్పించాలని చూస్తున్నారని ఆరోపించారు. కనీస విచారణ లేకుండా నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో రాజకీయ ప్రయోజనం పొందటం టీఆర్ఎస్, బీజేపీలకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అందరి హక్కులను కాపాడేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.