Mallikarjun Kharge wins the Congress presidential elections:కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అంతా అనుకున్న ప్రకారం మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. శశిథరూర్ పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రెండు దశాబ్ధాల తరువాత తొలిసారిగా గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఖర్గేకు 7897 ఓట్లు రాగా.. శశి థరూర్ కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. పార్టీకి 98వ అధ్యక్షుడిగా ఖర్గే విజయం సాధించారు.
Read Also: Talasani Srinivas Yadav: చిల్లర రాజకీయాలు చేయొద్దు.. బీజేపీకి వార్నింగ్
ఖర్గే 1942, జూలై21న కర్ణాటక బీదర్ జిల్లా వార్వట్టి గ్రామంలో జన్మించారు. 80 ఏళ్ల మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా, గాంధీ కుటుంబానికి అనుకూలవాదిగా, విధేయుడిగా ఖర్గేకు పేరుంది. 1972 నుంచి 2014 వరకు వరసగా తాను పోటీచేసిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నాడు. వరసగా 11 సార్లు ఎన్నికల్లో గెలిచి రికార్డు సాధించారు ఖర్గే. గుల్బర్గా యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పట్టా పొందారు. గుల్బార్గా కాలేజీలో చదువుతున్న సమయంలో స్టూడెంట్ యూనియన్ నేతగా పేరు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభం అయింది. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. అధ్యక్ష పదవికి చేరుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలు నమోదు చేసేలా వ్యూహాలు రచించే బాధ్యత ఇప్పుడు మల్లికార్జున ఖర్గేపై ఉంది. వరసగా పలు రాష్ట్రాల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీని గెలుపు బాట పట్టించే విధంగా ఖర్గే పనిచేయాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ఏడాాది రాబోతున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ఖర్గే సామర్థ్యానికి పరీక్షగా నిలువనున్నాయి. ఖర్గే గెలుపుపై శశిథరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఖర్గే హయాంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.