సుప్రీం కోర్టులో ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తాకింది. అనర్హత పిటిషన్ పై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు నో చెప్పింది. సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ఉద్ధవ్ ఠాక్రే వేసిన పిటిషన్ పై అత్యవసర విచారణను సుప్రీం తోసిపుచ్చింది. మహారాష్ట్రలో యథాతద స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అనర్హత ఎదుర్కొంటున్న 16 మంది ఎమ్మెల్యేలపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఈ విషయాన్ని స్పీకర్ కు తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది.
కేసు విచారణ సందర్భంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ కేసు కోసం ధర్మాసనం ఏర్పాటు చేయాలని అందుకు సమయం పడుతుందని ఆయన అన్నారు. 16 మంది ఎమ్మెల్యేల అనర్హతతో పాటు ఈ నెల జరిగిన స్పీకర్ ఎన్నిక, చీఫ్ విఫ్ నియామకం, ప్రభుత్వ ఏర్పాటుపై కూడా ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు నిర్ణయంతో షిండే వర్గానికి బిగ్ రిలీఫ్ లభించినట్లైంది.
Read Also: BJP Laxman: కేసీఆర్ ఫైటర్ కాదు చీటర్..
సుప్రీం కోర్టు తీర్పుపై ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ..సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ షిండే ప్రభుత్వం మనుగడ గురించి కాదని.. ఇది ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిందని అన్నారు. న్యాయ వ్యవస్థకు ఇది పెద్ద పరీక్ష అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తన నివాసం ‘ మాతో శ్రీ’లో ఎంపీల సమావేశానికి ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. తనకు మద్దతుగా నిలిచినందుకు 15 మంది ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ ఠాక్రే లేఖలు రాశారు. కఠిన పరిస్థితుల్లో తనకు అండగా నిలబడినందుకు థాంక్స్ చెప్పాడు. ఎలాంటి ఆఫర్లకు, ఒత్తళ్లకు లొంగ లేదని అందుకు లేఖలో పేర్కొన్నాడు.