తెలంగాణలో యూపీ తరహా పాలన రావాలని.. కేసీఆర్ ఫైటర్ కాదు చీటర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత కే. లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా వస్తున్న ఫలితాలు, జాతీయ కార్యవర్గ సమావేశం, విజయ సంకల్ప సభకు భారీగా జనాలు రావడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్ పీఠాలు కదులుతున్నాయని.. మోదీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదని ఆయన అన్నారు. మోదీ పద్మ అవార్డులు, రాజ్యసభ స్థానాలు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ద్వారా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు.
అట్టడుగు వర్గాల వ్యక్తిని ముఖ్యమంత్రి చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. 18 శాతం ఉన్న దళితులకు ఒక మంత్రి అని.. 10 శాతం ఉన్న గిరిజనులకు ఒక మంత్రి పదవని.. ఒక శాతం ఉన్న కులానికి, మీ కుటుంబంలో ఉన్న వారికి 4 మంది మంత్రి పదువులు ఇచ్చారని విమర్శించారు. అందుకే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఈశాన్య భారతంలో క్రైస్తవులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వారే ముఖ్యమంత్రులు, స్పీకర్లుగా కొనసాగుతున్నారని.. ఇదే మోదీ సామాజిక న్యాయసూత్రం అని అన్నారు.
Read Also: Supreme Court: విజయ్ మాల్యాకు బిగ్ షాక్.. కోర్టు ధిక్కార కేసులో నాలుగు నెలల జైలుశిక్ష
తెలంగాణలో యూపీ తరహా పాలన రావాలని కోరుకుంటున్నానని లక్ష్మణ్ అన్నారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. యూపీలో సంక్షేమ పాలన సాగుతోందని ఆయన అన్నారు. ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలు పెంచారని.. మద్యం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాడని.. డిస్కంలకు బకాయిలు చెల్లించకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల నుంచి రేషన్ కార్డులు లేవని.. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ
బీజేపీ విజయ సంకల్ప సభ షాక్ నుంచి తేరుకోవడానికి కేసీఆర్‌కు వారం పట్టిందని.. పుత్ర వాత్సల్యంతో ఆర్జేడీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు ఎలా పతనం అయ్యాయో.. అడ్రస్ లేకుండా పోయాయో.. రేపు టీఆర్‌ఎస్‌కు కూడా అదే గతి పడుతుందని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ను ఎప్పుడు గద్దె దించాలా అని చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీ రద్దు చేడమని.. ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముషీరాబాద్ లో నీ బొమ్మ పెట్టుకుని ప్రచారం చేస్తే ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేదని గుర్తు చేశారు.