Maharashtra To Set Up Safety Squad For Eloped Girls: శ్రద్ధా వాకర్ హత్య యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా చంపేశారు. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి ఢిల్లీ చుట్టుపక్కట పారేశాడు. ఈ కేసులో వివరాలు సేకరించే పనిలో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. ఇదిలా ఉంటే శ్రద్ధా హత్య నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది.
Read Also: Bajrang Dal: శ్రద్ధావాకర్ హత్య “లవ్ జీహాద్”కు ఉదాహరణ.. అఫ్తాబ్ దిష్టిబొమ్మ దహనం
మహిళ రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మహారాష్ట్రలోని స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా శనివారం తెలిపారు. తల్లిదండ్రులతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి రక్షణ కోసం ఈ ప్రత్యేక స్వ్కాడ్ పనిచేయనుంది. ఇంటి నుంచి పారిపోతున్న అమ్మాయి కోసం ప్రత్యేక స్వ్కాడ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ఒక అమ్మాయికు 18 ఏళ్లు దాటిన తర్వాత అమె కుటుంబం బలవంతం చేయకూడదని.. అయితే కుటుంబ సభ్యులతో గొడవ పడినప్పుడు, తల్లిదండ్రులను ఎదురిస్తూ వివాహం చేసుకున్నప్పుడు ఆమెకు కుటుంబం నుంచి సహాయం లభించదని అన్నారు.
ఇదిలా ఉంటే శ్రద్ధా హత్య కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే శ్రద్ధా ఎముకలు, బ్లడ్ శాంపిళ్లను సేకరించి డీఎన్ఏ పరీక్షకు పంపారు. దీంతోపాటు శ్రద్ధను హత్య చేసినట్లు నిందితుడు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. మరో ఐదు రోజుల్లో అఫ్తాబ్ కు నార్కో టెస్టు నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 15 రోజలు తర్వాత వచ్చే డీఎన్ఏ రిపోర్టు ఈ హత్యలో కీలకంగా మారనుంది.