Shraddha Walkar case- Bajrang Dal workers burn accused Aaftab Poonawala’s effigy: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని గగుర్పాటుకు గురిచేసింది. అత్యంత దారుణంగా శరీరాన్ని 35 భాగాలుగా చేసి చంపేసిన తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పలు సంఘాలు నిందితుడు అఫ్తాబ్ పూనావాలను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. శ్రద్ధా తండ్రి నిందితుడు అఫ్తాబ్ తలను వేరు చేసి చంపేయాలని తన ఆవేదనను వ్యక్తం చేశారు. శ్రద్ధా మరణంపై న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, స్వామీజీలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మే నెలలో శ్రద్ధాను గొంతు కోసి హత్య చేశారు అఫ్తాబ్. శరీరాన్ని 35 ముక్కలు చేసి, 18 రోజుల పాటు రాత్రి సమయంలో ఆమె శరీర భాగాలను ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పారేశాడు.
Read Also: Donald Trump Back On Twitter: ట్విట్టర్ లోకి ట్రంప్ రీఎంట్రీ.. రెండేళ్ల తరువాత సస్పెన్షన్ ఎత్తివేత
ఇదిలా ఉంటే శ్రద్ధా మరణంపై హిందూ సంస్థ బజరంగ్ దళ్ తీవ్ర నిరసన తెలిపింది. ఆమె హత్యలో నిందితుడిగా ఉన్న అఫ్తాబ్ పూనావాలను శిక్షించాలని డిమాండ్ చేసింది. గోవాలో నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. దక్షిణ గోవాల జిల్లాలోని కర్చోరెమ్ పట్టణంలో శ్రద్ధావాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. శ్రద్ధా హత్య ‘లవ్ జిహాద్’కి ఉదాహరణ అని బజరంగ్ దళ్ ఆరోపించింది.
శ్రద్ధా హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఢిల్లీ పోలీసులు. ఇప్పటికే శ్రద్ధాకు సంబంధించిన ఎముకలను గుర్తించారు. దీంతో పాటు అఫ్తాబ్ ప్లాట్ లో శ్రద్ధా బ్లడ్ శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబుకు పంపించారు. దొరికిన శాంపిళ్ల డీఎన్ఏను శ్రద్ధా తండ్రితో పోల్చి చూడనుంది. దీనికి సంబంధించిన రిపోర్టులు వచ్చే సరికి 15 రోజుల సమయం పట్టనుంది. నిందితుడు ఉపయోగించిన ఆయుధాలు, శ్రద్ధా మొబైల్ ఫోన్ కోసం ముమ్మరంగా వేటసాగిస్తున్నారు.