Maharashtra Elections 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో మతం ఆధారంగా ఓట్లు అడిగేలా అనేక ముస్లిం సంస్థలు ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ శనివారం ఆరోపించింది. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టుని కోరింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యకర్త మౌలానా సజ్జాద్ నోమాని మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి బహిరంగంగా మద్దతు ప్రకటించారని ఆరోపించారు.
Read Also: Mystery Man: యూపీలో ‘‘మిస్టరీ మ్యాన్’’ అరెస్ట్.. నిద్రిస్తున్న మహిళ తలపై కొట్టి, దోపిడీలు..
రాష్ట్రంలోని 269 స్థానాల్లో ఎంవీఏకు ఓటు వేయాలని, బీజేపీయేతర పార్టీలకు ఓటేయాలని నోమానీ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు, ఇలాంటి ప్రకటనలు ప్రజాస్వామ్య సూత్రాలకు ముప్పు అని భాటియా పేర్కొన్నారు. అంతకుముందు జార్ఖండ్‌లోని జమియత్ ఉలేమా ఇ హింద్ కూడా ఇలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమికి ఓటు వేయాలని ముస్లింలను కోరారు.
ఇలా పలు ముస్లిం సంస్థలు, నాయకులు ఒకే పార్టీకి ఓటేయాలని కోరడాన్ని బీజేపీ ‘‘ఓట్ జిహాద్’’గా పిలుస్తోంది. “దీన్నే ఓటు జిహాద్” అని భాటియా అన్నారు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే మరియు శరద్ పవార్‌లు “బుజ్జగింపు రాజకీయాలు” చేస్తున్నాయని, ప్రజాస్వామ్య సమగ్రత కంటే “అధికార వ్యామోహం”కు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇండియా కూటమి విధానంతో అక్రమ వలసలను ప్రోత్సహించడం, వారికి మద్దతు ఇవ్వడం వంటి ఉన్నాయని అన్నారు. ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని చెప్పారు. మతపరమైన ప్రాతిపదికన చేసిన అప్పీళ్లపై విచారణ జరిపి, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం మరియు సుప్రీం కోర్టును కోరింది, ఇటువంటి పద్ధతులు అవినీతి ఎన్నికల ప్రవర్తనగా పరిగణించబడుతున్నాయని పేర్కొంది.