Students Fall Ill After Eating Hostel food: బల్లి పడిన ఆహారం తిన్న విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో జరిగింది. కూరలో బల్లి పడిన ఆహారం తిన్న హాస్టల్ లోని విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత కళ్లు తిరగడంతో పాటు, వాంతులు బారిన పడ్డారు విద్యార్థినులు. 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కూరలో బల్లి ఉండటాన్ని గమనించామని విద్యార్థినులు తెలిపారు.
Read Also: tag mahal : తాజ్ మహల్ పై వివాదం.. సుప్రీంకోర్టులో పిటీషన్
అస్వస్థతకు గురైన బాలికలను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఒక బాలికను ఆస్పత్రిలో చేర్చగా.. మిగిలిన వారికి ప్రథమ చికిత్స అందించారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ జగదీష్ సోని తెలిపారు. వైద్య బృందం హాస్టల్‌ను సందర్శించి 30 మంది బాలికల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించింది. ఫుడ్ సేఫ్టీ టీం శుక్రవారం హాస్టల్ లోని ఇతర కూరగాయలను, ముడి పదార్థాలను, నీటి నమూనాలను సేకరించి విచారణ జరుపుతోంది.
బాలికలు తిని అస్వస్థతకు గురైన ఆహార పదార్థాలను బయటపడేశారు. దీంతో నమూనాలను సేకరించలేదని పోలీస్ అధికారి వాసుదేవ్ తెలిపారు. కోటా సిటి అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ బ్రిజ్ మోహన్ బైర్వా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌స్టిట్యూట్‌లు, హాస్టళ్లపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎంహెచ్ఓ ను ఆదేశించారు బ్రిజ్ మోహన్ బైర్వా.