Kerala: కేరళలో వెటర్నరీ విద్యార్థి మరణం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వయనాడ్‌లోని వెటర్నరీ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న జేఎస్ సిద్ధార్థ్ ఫిబ్రవరి 18న కాలేజీ హాస్టల్‌లో ఉరేసుకుని మరణించాడు. అయితే, ఇది ఆత్మహత్య కాదని హత్య అని బాధితుడి కుటుంబం ఆరోపిస్తుంది. ఈ కేసులో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ని శనివారం సస్పెండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. సిద్ధార్థ్ మరణించడానికి ముందు ర్యాగింగ్ చేసి చిత్ర హింసలకు గురిచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రేమికుల దినోత్సవం రోజు సిద్ధార్థ్ సీనియర్ విద్యార్థినిలతో డ్యాన్స్ చేసినందుకే అతడిని ర్యాగింగ్ పేరుతో తీవ్రంగా హింసించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
తన కుమారుడి శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని, అతకి ఆహారం ఇవ్వకుండా తీవ్రంగా కొట్టారని బాధితుడి తండ్రి పేర్కొన్నాడు. పోస్ట్‌మార్ట నివేదికను ఉటంకిస్తూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఇది ర్యాగింగ్ కాదని, హత్యగా తేలిందని చెప్పారు. ఇది యూనివర్సిటీ వైఫల్యమే అని, దాదాపుగా మూడు రోజులుగా చిత్ర హింస కొనసాగిందని, ఇది ఎవరికీ తెలియదని, విషయాన్ని ఛాన్సలర్‌కి నివేదించడం విశ్వవిద్యాలయం విధి, కానీ అది జరగలేదని, దీంతో వైస్‌ఛాన్సలర్‌ని సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
Read Also: BJP: తొలి జాబితాలో ఉన్న బీజేపీ టాప్ లీడర్లు వీరే.. పోటీ చేస్తున్న స్థానాలు ఇవే..
ఈ ఘటనపై యూనివర్సిటీ ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ విచారణకు ఆదేశించారు. నిందితులంతా అధికార సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎస్ఐకి చెందినవారని, అందుకు ఆ పార్టీ వారికి రక్షణ కల్పిస్తోందని బాధితుడి కుటుంబం ఆరోపించింది. ప్రతీ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఒక హాస్టల్‌ని ఆఫీసుగా మార్చుకుందని, ఎస్ఎఫ్ఐ వారు నిషేధిత పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కలిసి పనిచేస్తున్నారని, ఇందులో పీఎఫ్ఐ సానుభూతిపరులు ఉన్నట్లు వయనాడ్ నుంచి తనకు నివేదికలు అందాయని గవర్నర్ చెప్పారు.
నిందితులను యూనివర్సిటీ అధికారులు రక్షిస్తున్నారని బాధితుడి కుటుంబం ఆరోపించింది. పోలీసులు రాకముందే అధికారులు మృతదేహాన్ని కిందకు దించారని వారు ఆరోపించారు. డీన్ సహా ఉపాధ్యాయులు ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ ఆరోపించారు. ఇలాంటి టీచర్లపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిగి, చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని సీఎం పినరయి విజయన్ పోలీసులను ఆదేశించారు.