Karnataka: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీజేపీ తీసుకువచ్చిన అన్ని చట్టాలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకువచ్చని మతమార్పిడి నిరోధక చట్టాన్ని గురువారం కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు పాఠశాల్లలో హిస్టరీ సిలబస్ మార్పు, వ్యవసాయ మార్కెట్లపై చట్టంలో కూడా మార్పులకు ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Read Also: Edible oil prices: దిగిరానున్న వంటనూనెల ధరలు.. దిగుమతి సుంకాన్ని తగ్గించిన కేంద్రం
బలవంతంగా, ఆకర్షించడం, తప్పుడు ప్రాతినిధ్యం ద్వారా మతమార్పిడికి వ్యతిరేకంగా గత బీజేపీ ప్రభుత్వం మే నెలలో ఆర్డినెస్స్ రూపంలో ప్రవేశపెట్టింది. అంతకుముందు ఏడాది సెప్టెంబర్ నెలలో రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. మైనారిటీలను వేధించే ప్రక్రియలో భాగంగానే బీజేపీ ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆ సమయంలో కాంగ్రెస్ ఆరోపించింది. ఈ చట్టం కోర్టు వరకు వెళ్లింది. ఇది మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అని క్రైస్తవ సంస్థలు కోర్టులో వాదించాయి.
ఇదిలా ఉంటే బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన వీడీ సావార్కర్, కేబీ హెడ్గేవార్ అధ్యయాలను బీజేపీ పాఠ్యాంశాలుగా చేర్చింది. అయతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని తొలగిస్తుందని క్యాబినెట్ మంత్రి పాటిల్ వెల్లడించారు. పాఠశాల సిలబస్ లో బీజేపీ చేసిన అన్ని మార్పులను తొలగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాల్లలో రాజ్యాంగ ప్రవేశికను తప్పనిసరిగా చదవాలని మంత్రి వర్గం నిర్ణయించింది. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన చట్టం స్థానంలో వ్యవసాయ మార్కెట్ల (ఏపీఎంసీ)పై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.