Ganja smugglers attacked the police: గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి తెగబడ్డారు స్మగ్లర్లు. దాడిలో సీఐ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చావుబతులకు మధ్య ఉన్నారు. సీఐ శ్రీమంత్ ఇల్లాల్ నేతృత్వంలో పోలీసుల టీం దర్యాప్తులో భాగంగా బీదర్ జిల్లాలో సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామంలో గంజాయి పంటను సాగు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. బీదర్ జిల్లాలోని కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని తురోరి, హోన్నాలి గ్రామాల సమీపంలో శుక్రవారం అర్థరాత్రి 40 మందికి పైగా స్మగ్లర్ల ముఠా పోలీసులపై విచక్షణారహితంగా దాడులు చేశారు.
దాడిలో సీఐ శ్రీమంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కలబురిగిలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. శ్రీమంత్ పక్కటెముకలు విరిగిపోయాయి. దీంతో ఉపిరితిత్తులు దెబ్బతిన్నాయి. తల, ముఖంపై తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఐజీ మనీష్ ఖర్చికర్, ఎస్పీ ఇషా పంత్, ఏఎస్పీ ప్రసన్న దేశాయ్, ఇతర సీనియర్ ఆఫీసర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Read Also: North Korea: నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం.. కమలా హారిస్ పర్యటన ముందు కీలక చర్య
సీఐ ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆయన్ను హైదరాబాద్ లేదా బెంగళూర్ కు తరలించాలని కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర సూచించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆయనను ఇతర ప్రాంతాలకు తరలించడం అంత సురక్షితం కాదని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ఉస్మానాబాద్ ఎస్పీతో చర్చించామని ఎస్పీ ఇషా పంత్ వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆమె వెల్లడించారు.
గురువారం కలబురిగి పోలీసులు ఇద్దరు గంజాయి వ్యాపారులను పట్టుకుని విచారించగా.. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఉస్మానాబాద్ జిల్లా ఒమెర్గా తాలుకాలోని వ్యవసాయక్షేత్రంలో గంజాయిని సాగు చేస్తున్నారని నిందితులిద్దరు వెల్లడించారు. ఈ సమాచారంతో పోలీసులు రైడ్ చేయడానికి వెళ్లిన క్రమంలో పోలీసులపై దాడి జరిగింది. అయితే ముందుగా కర్ణాటక పోలీసులు, మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చే లోపే కర్ణాటక పోలీసులపై దాడి జరిగింది.