North Korea fires ballistic missile: నార్త్ కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఆదివారం నార్త్ కొరియా తూర్పు తీరం నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తర కొరియాలోని ప్యాంగాంగ్ ప్రావిన్సులోని టైచోన్ ప్రాంతం నుంచి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. మాక్ 5 వేగంతో దాదాపుగా 60 కిలోమీటర్ల ఎత్తులో 600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. కాగా.. క్షిపణి 50 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరిందని జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమాడా తెలిపారు.
Read Also: Syria Boat Capsized: సిరియా వెళుతున్న వలసదారుల పడవ బోల్తా.. 94 మంది మృతి
దక్షిణ కొరియా, అమెరికా దళాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్న సమయంలో ఈ పరీక్షలు చేసింది ఉత్తర కొరియా. మరో వైపు ఈ ప్రాంతంలో యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సందర్శనకు ముందు నార్త్ కొరియా ఈ ప్రయోగాన్ని చేపట్టడం చూస్తే..అమెరికాకు ఓ హెచ్చరిక జారీ చేసిందని తెలుస్తోంది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు కలిగించేలా ఉందని.. దక్షిణ కొరియా విమర్శించింది. బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్, కెనడా పర్యటన ముగించుకుని శనివారం ఆలస్యంగా సియోల్ చేరుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్‌కు ఈ ప్రయోగం గురించి వివరించినట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు దక్షిణ కొరియా, అమెరికా జాయింట్ మిలిటరీ డ్రిల్స్ చేపడుతున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ దక్షిణ కొరియాలోని బూసాన్ చేరుకుంది. చివరిసారిగా జూన్ నెలలో ఒకే రోజు 8 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన తర్వాత.. తాజాగా ఆదివారం క్షిపణి ప్రయోగాలు జరిపింది ఉత్తర కొరియా. అమెరికాతో పాటు రష్యా, చైనాలు కూడా ఈ ప్రయోగాలను విమర్శించాయి. ఉద్రిక్తతలు పెంచే విధంగా చర్యలకు పాల్పడవద్దని సూచించారు.