అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయం సాధించాలంటూ తమిళనాడు వాసులు పూజలు చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ బ్యానర్లు కట్టారు. తీరా.. ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పటికీ నిరాశలోకి వెళ్లిపోయారు. ఆమె తల్లి పూర్వీకుల గ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురం ప్రజలు ఆవేదన చెందారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓడిపోయినా.. ఆమె ఒక పోరాట యోధురాలని కొనియాడారు. ఆమె మళ్లీ నాలుగేళ్ల తర్వాత వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా గెలిచితీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తులసేంద్రపురం గ్రామ ప్రజలు.. బుధవారం ఉదయం నుంచి.. అమెరికా ఎన్నికల ఫలితాల కోసం టీవీలకు అతుక్కుపోయారు. కమలా హారిస్ విజయం కోసం శ్రీ ధర్మ శాస్తా పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించి.. పూజలు చేశారు. అయితే డెమోక్రాటిక్ ప్రత్యర్థి కమలా హారిస్ ఓడిపోవడంతో తులసేంద్రపురం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. గ్రామానికి వచ్చిన ఇద్దరు అమెరికన్లు, ఓ యూకే పౌరుడు ఊరు నుంచి వెళ్లిపోయారని గ్రామవాసులు తెలిపారు.
తులసేంద్రపురం గ్రామ నాయకుడు జే.సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ… కమలా హారిస్ విజయం సాధిస్తారని అనుకున్నామన్నారు. దీపావళి కంటే పెద్దగా వేడుకలను ప్లాన్ చేసినట్లు చెప్పారు. బాణాసంచా పేల్చడం, మిఠాయిలు పంపిణీ చేయడం, ఆలయ పూజలు చేయటం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని.. తీరా ఫలితాలు కమలకు వ్యతిరేకంగా వచ్చాయన్నారు. అయినా ఆమె పోరాట స్ఫూర్తిని తప్పక మెచ్చుకోవాలన్నారు. ఆమె పోరాట యోధురాలు, దేవుడి దయతో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తారని ఆకాంక్షించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 270 మ్యాజిక్ ఫిగర్ ఉండగా.. ప్రస్తుతం ఇప్పటి వరకూ ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఇక విస్కాన్సిన్‌లో ట్రంప్ గెలుపొందారు. తాజా ఫలితాలను చూస్తుంటే అమెరికన్లు ఏకపక్షంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ను గెలిపించాలన్న ఉద్దేశంతోనే అమెరికన్లు ఏకపక్షంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా ట్రంప్ భారీ విజయం దిశగా దూసుకెళ్లారు. ఇక రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడంపై ప్రపంచ నాయకులంతా శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికాలో అధ్యక్షుడిగా గెలవాలంటే 270 ఓట్లు సాధించాలి. కానీ ఆ సంఖ్య దాటేసింది. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2017 నుంచి 2021 వరకు అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ పనిచేశారు. 2021 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడంతో జో బైడెన్ అధ్యక్షుడయ్యారు. అధ్యక్ష పదవి పోయిన తర్వాత ట్రంప్ ఎన్నో ఆరోపణలు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ రానున్న ఎన్నికల్లో గెలిచి చూపిస్తానంటూ సవాల్ చేసి మరీ గెలిచారు.