JP Nadda: మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సంచలన విషయాలను హేమా కమిటీ వెలుగులోకి తీసుకువచ్చింది. పలువురు స్టార్ యాక్టర్స్ మహిళా టెక్నీషియన్స్, నటీమణులపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. దీనికి తోడు పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న కొన్ని వేధింపుల గురించి చెప్పడం సంచలనంగా మారింది. మలయాళ స్టార్ హీరో జయసూర్యతో పాటు ఎం ముఖేష్, సిద్ధిక్, చిత్ర నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ వంటి వారిపై ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు చేసిన మహిళా యాక్టర్లలో మిను మునీర్, బెంగాలీ నటి శ్రీ లేఖ మిత్ర, సోనియా మల్హర్ వంటి వారు ఉన్నారు. ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ చేస్తోంది.
ఇదిలా ఉంటే, మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై హేమా కమిటీ నివేదికపై బీజేపీ స్పందించింది. కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం ఇందులో భాగస్వామిగా ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు అన్నారు. కేరళలోని పాలక్కాడ్‌లో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేరళలోని సీపీఎం ప్రభుత్వం హేమా కమిటీ నివేదిక విడుదలలో జాప్యాన్ని ప్రశ్నించారు.
Read Also: Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రే శివాజీ పేరు చెప్పుకుంటూ ఔరంగజేబులా ప్రవర్తిస్తున్నాడు..
‘‘హేమా కమిటి నివేదికపై న్యాయం చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది..? మీ ప్రభుత్వాన్ని ఎవరు ఆపుతున్నారు… ఎందుకంటే మీరు కూడా ఇందులో భాగంగా ఉన్నారు’’ అని ఆయన ఆరోపించారు. మీ పార్టీ సీపీఎం వ్యక్తుల ప్రమేయం ఉంది కాబ్టి మీరు దీనిని దాచాలనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ప్రమేయం ఉందని హేమా కమిటి నివేదిక చాలా ప్రముఖంగా చెప్పడంపై తాను చింతిస్తున్నానని అన్నారు. సీఎం బయటకు వచ్చి అసలు ఏమి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను గురించి జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఈ నెల ప్రారంభంలో బహిరంగపరచడంతో మలయాళ చిత్ర పరిశ్రమ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మహిళలపై లైంగిక వేధింపులు, కమిట్‌మెంట్లు, అడ్వాన్సుల గురించి కమిటీ తీవ్రమైన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు పినరయి విజయన్ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది.