Eknath Shinde: సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయిన ఘటనపై మహారాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార ఏక్‌నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు గుప్పిస్తోంది. ఈ రోజు విగ్రహం కూలిపోయిన ఘటనకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు చేస్తు్న్న ఆందోళనలపై ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఫైర్ అవుతోంది. దీనిని రాజకీయం చేయడం మానుకోవాలని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
ఇదిలా ఉంటే, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రేపై, సీఎం ఏక్‌నాథ్ షిండే విరుచుకుపడ్డారు. ఠాక్రే ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుతో రాజకీయాలు చేస్తూ ఔరంగజేబు, అఫ్జల్ ఖాన్ మార్గంలో నడుస్తున్నాడని షిండే విమర్శించారు. రెండేళ్ల కిందట మహారాష్ట్ర ప్రజలు ఉద్ధవ్ ఠాక్రేని బయటకు గెంటేశారని దుయ్యబట్టారు. ఠాక్రే శివాజీ పేరుతో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చి ఇతరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.
Read Also: Chandrababu- Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు ఫోన్..
విపక్షాలు ఈ అంశంపై రాజకీయం చేయడం బాధాకరమని చెప్పారు. శివాజీ మాకు రాజకీయ అంశం కాదు, ఆయన మాకు గుర్తింపు, మా విశ్వాసం అని చెప్పారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని చెప్పారు. ‘‘కర్ణాటకలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పగలగొట్టేందుకు రెండు జేసీబీలు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని కూల్చివేశారు.. ఇలా చేసిన వారిని కొట్టాలి. ఇది చేయకుండా, వారు (కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే) ఇక్కడ నిరసనలు చేస్తున్నారు, కానీ మహారాష్ట్ర ప్రజలు తెలివైనవారు, వారు దీనిని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు బూట్లతో కొడతారు’’ అని పరోక్షంగా కాంగ్రెస్‌ని షిండే విమర్శించారు.
ఆగస్టు 26న సింధుదుర్గ్ జిల్లాలోని శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంతో ఈ అంశం రాజకీయంగా మారింది. కొద్ది నెలల క్రితమే ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. విగ్రహం కూలిపోయిన అంశంపై ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పారు.