Asaduddin Owaisi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ బుధవారం పార్లమెంట్ ముందుకు రాబోతోంది. రేపు మధ్యాహ్నం బిల్లును ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే, ఎంపీలు అంతా సభకు హాజరుకావాలని ఎన్డీయే పార్టీలు తమ తమ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మరోవైపు, ఈ బిల్లును అడ్డుకునే దిశగా కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ వంటి ఇండీ కూటమి నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. రేపు, ఉదయం ఇండీ కూటమి ఎంపీలతో రాహుల్ గాంధీ సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, వక్ఫ్ బిల్లుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,25,26,29ని ఉల్లంఘిస్తోందని అన్నారు. ఇది వక్ఫ్ బిల్లు కాదని, వక్ఫ్‌ని ధ్వంసం చేసే బిల్లు అని అన్నారు. ఈ బిల్లుకు ఎన్డీయే మిత్రపక్షాలైన నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, చిరాగ్ పాశ్వార్, జయంత్ చౌదరిలు మద్దతు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు.
Read Also: Northeast: ‘‘బంగ్లాదేశ్‌ని విచ్ఛిన్నం చేయడమే మంచిది’’.. యూనస్‌పై ఈశాన్య నేతలు ఫైర్..
ఎన్డీయే మిత్రపక్షాలు తమ రాజకీయ కారణాల వల్ల ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారని, 5 ఏళ్ల తర్వాత ప్రజలకు మీరు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. హిందూ ఎండోమెంట్ బోర్డులో హిందువు కాని వ్యక్తి సభ్యుడిగా చేరలేకపోతే, మీరు ముస్లిం కాని వ్యక్తిని వక్ఫ్ బోర్డులోకి ఎలా అనుమతిస్తారు..? అని ప్రశ్నించారు.
వక్ఫ్ బిల్లుపై మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. వక్ఫ్ బిల్లుపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముస్లింల ఆస్తులను, హక్కులను లాక్కోబోదని ఆయన స్పష్టం చేశారు. అమాయక ముస్లింలను తప్పుదారి పట్టిస్తు్న్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. ఓవైసీ లాగే కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించారు. దీనిని రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. బిల్లు అమలుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని, ఎన్డీయే మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ ఈ అంశంపై వారి వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు.