Northeast: బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ తన చైనా పర్యటనలో ‘‘ఈశాన్య రాష్ట్రాల’’ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చైనాను బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తూనే, భారతదేశానికి చెందిన ఏడు సిస్టర్ స్టేట్స్(ఈశాన్య రాష్ట్రాలు) ల్యాండ్ లాక్డ్‌గా ఉన్నాయని, వాటికి సముద్ర మార్గం లేదని, బంగ్లాదేశ్ సముద్రానికి రక్షకుడిగా ఉంటుందని వ్యాఖ్యానించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ పెట్టుబడులకు, ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, మహ్మద్ యూనస్ భారత్ ప్రధాన భూభాగాలను, ఈశాన్య రాష్ట్రాలను కలిపే ‘‘సిలిగురి కారిడార్’’ లేదా ‘‘చికెన్స్ నెక్’’ దుర్భలత్వాన్ని గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని విదేశీ వ్యవహారాల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also: 125cc Bikes: మీ నెలవారీ జీతం రూ. 30,000 అయితే.. కొనేందుకు 125cc బెస్టు బైకులు ఇవే!
ఇదిలా ఉంటే, ఆయన వ్యాఖ్యలపై ఈశాన్య రాష్ట్రాల నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా, బీజేపీ ఫైర్ బ్రాండ్, అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకం, ఖండించదగినవి అని అన్నారు. ఇది భారతదేశ వ్యూహాత్మక ప్రాంతం చికెన్స్ నెక్ వీక్‌నెస్‌ని నొక్కి చెబుతోందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వ్యూహాత్మక, దీర్ఘకాలిక అజెండాలను ప్రతిబింబిస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు భారత్‌ని ఈశాన్య రాష్ట్రాలను విడదీయాలనే ప్లాన్‌ని సూచిస్తున్నాయని అన్నారు. ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు మౌలిక సదుపాయాలను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. సిలిగురి కారిడార్‌లో బలమైన రైల్వే, రోడ్డు నెట్వర్క్ డెవలప్ చేయాలని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించాలని సూచించారు.
త్రిపురకు చెందిన తిప్రా మోతా పార్టీ చీఫ్ ప్రద్యోత్ మాణిక్య మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భారత్ దూకుడు విధానాన్ని అవలంబించాలని సూచించారు. వినూత్నమైన, సవాలుతో కూడిన ఇంజనీరింగ్ ఆలోచనలకు బిలియన్లు ఖర్చు చేసే బదులుగా మనం బంగ్లాదేశ్‌ని విచ్ఛిన్నం చేసి, సముద్ర మార్గాన్ని సొంతం చేసుకోవాలని కోరారు. 1947లో చిట్టగాంగ్ ఓడరేవుపై నియంత్రణ వదులుకోవడాన్ని ఆయన తప్పుడు నిర్ణయంగా చెప్పారు. చిట్టగాంగ్ కొండ ప్రాంతాల ప్రజలు ఆ సమయంలో భారత్‌లో కలవాలని అనుకున్నారని చెప్పారు. ఇప్పుడు బంగ్లాలో త్రిపురి,గారో, ఖాసీ, చక్మా ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారని అన్నారు.